04-01-2026 12:00:00 AM
స్టార్ హీరో యశ్ తాజాచిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కే నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేయటం ద్వారా సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘నాదియా’గా కియారా అద్వానీని, ‘ఎలిజిబెత్’గా హ్యూమా ఖురేషిని, ‘గంగ’గా నయనతారను పరిచయం చేసిందీ చిత్రబృందం. తాజాగా ‘రెబెకా’గా అలరించనున్న తారా సుతారియా పాత్రను పరిచయం చేశారు.
ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేశారు. ఈ పోస్టర్‌లో తారా సుతారియా.. అందంగా, స్టుల్‌గా కనిపిస్తూనే ఆమె గన్స్‌ను ఉపయోగిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. తనను తాను రక్షించుకోగల ధైర్యం, సామర్థ్యమున్న పాత్రలో ఆమె మెప్పించను న్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ “తారా నుంచి సహజమైన ప్రేమను ఆస్వాదించా. ఆమె స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి. అదే ఆమెకు రక్షణ అని అనుకుంటున్నా.
దీని గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. నటిగా ఆమెకు కావాల్సినంత స్వేచ్చను ఇస్తే చాలు. అదే నేను చేశా. అది మా బంధం బలమైందిగా మారటానికి దోహదపడింది. ఆమె ప్రతి విషయాన్ని సునిశితంగా గమనించేది. పాత్ర గురించి ఎక్కువగా ఆలోచించేది. ఆమెను ఎలా గైడ్ చేయాలా? అని నేను ఆలోచించిన సందర్భాలున్నాయి. కానీ ఆమె పాత్రలో అద్భుతంగా జీవించింది.
అది నన్నెంతో ఆశ్చర్యపరిచింది. అందరినీ ఆశ్చర్యపరుస్తుందనటంలో సందేహం లేదు” అని పేర్కొన్నారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో మార్చి 19న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని రాజీవ్ రవి నిర్వహిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ నిర్వహిస్తున్నారు.