04-01-2026 12:00:00 AM
లేడీ సూపర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నయనతార సినీప్రియులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం తన రూల్స్‌ను బ్రేక్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నయనతార నటించిన సినిమా ఎంత పెద్దదైనా, స్టార్ హీరో సినిమా అయినా సరే.. ప్రమోషన్లకు వెళ్లబోనని ముందే చెప్పేస్తుంది.
షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమా విషయంలోనూ నయన్ ప్రమోషన్స్‌కు దూరం గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆ నిబంధనను పక్కన పెట్టేసింది నయన్. చిరంజీవి రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా కోసం నయనతార స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది.
చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఓ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘హలో మాస్టర్ ఫేస్, కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి’ అంటూ నయనతార చెప్పిన ఈ వీడియోను చూసేందుకు సినీప్రియులు సోషల్ మీడియా వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు! నయన్.. స్టేజ్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటారా.. లేక ఇలా సోషల్ మీడియాకే పరిమితమవుతారా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.