calender_icon.png 5 January, 2026 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకున్నా

04-01-2026 12:00:00 AM

టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌తోపాటు నటనలోనూ తనదైన మార్క్ వేయాలనుకున్న ఈ బ్యూటీ.. ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ అందుకోలేకపోతోంది. తక్కువ సినిమాలు చేయడం.. అవి కూడా ప్రేక్షకాదరణకు నోచుకోకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఇండస్ట్రీలో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

ముఖ్యంగా తెలుగులో డింపుల్ నటించిన ‘ఖిలాడీ’, ‘రామబాణం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం ఈ ముద్దుగుమ్మను నిరాశపరిచాయి. వరుస ఫ్లాపుల ప్రభావంతో డింపుల్ దాదాపు రెండేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ గ్యాప్‌లో తనపై వస్తున్న విమర్శలను మౌనంగా భరిస్తూ, సరైన అవకాశాల కోసం  ఎదురుచూసింది. ఇప్పుడా నిశబ్దాన్ని ఛేదిస్తూ  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “రవితేజ, -ఇలియానా జోడీగా చేసిన ‘ఖతర్నాక్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

మళ్లీ అదే జోడీ రెండోసారి ‘కిక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక రవితేజ, నేను కలిసి చేసిన మొదటి సినిమా ‘ఖిలాడీ’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. కథ పరంగా కొన్ని లోపాలున్నందున ఆ సినిమా నిరాశపరిచింది. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్నా. ఈసారి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఈ చిత్రంలో కథకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, నా పాత్రకు పూర్తి న్యాయం జరిగేలా దర్శకుడు కిషోర్ తిరుమల చూపించిన శ్రద్ధ నన్ను బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా నా పాత్రలో భావోద్వేగాలు, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉండటం వల్ల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నా. గత సినిమా లోపాలను ఈసారి రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఈసారి తప్పు జరగకుండా చూసుకున్నా. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ హిట్ అందుకంటామని నమ్ముతున్నా” అని చెప్పుకొచ్చింది డింపుల్. రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోహీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్లలో అడుగుపెట్టనుందీ సినిమా.