01-07-2025 12:53:49 AM
-నిర్మాణాలు చేపట్టాలంటూ ప్రభుత్వ ఆదేశాలు
-ముహూర్తాలకు మొగ్గు చూపని లబ్ధిదారులు
సిద్దిపేట, జూన్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం అమలులో సాంప్రదాయ ఆచారాలే ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణాలకు తక్షణమే భూమి పూజలు చేసి పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, జిల్లాలోని మండలాల వారీగా లబ్ధిదారులకు నోటీసులు పంపుతూ అధికార యంత్రాంగం వేగంగా పనులు చేపడుతోంది.
అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం కావడంతో, పలుచోట్ల లబ్ధిదారులు భూమి పూజలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఆషాఢం మాసంలో ఇంటి పునాది వేయడం శుభం కాదు అనే నమ్మకంతో వారు భూమి పూజలను వాయిదా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు కొన్ని చోట్ల నిర్భంధంగా కార్యక్రమాలు నిర్వహించాలనే ఒత్తిడిలో ఉన్నప్పటికీ, లబ్ధిదారుల సహకారం లేకపోవడం వల్ల కార్యాచరణ మందగిస్తోంది.
అనేక విధాలుగా ప్రజలను సముదాయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, సంప్రదాయ విశ్వాసాలపై అవగాహన కల్పించడంలో లోపాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నాయకులు, ప్రజాప్రతినిధులు భూమి పూజలు చేయడాన్ని ముందుండి చేపడుతున్నప్పటికీ, సాధారణ లబ్ధిదారులు మాత్రం నిర్మాణ ప్రారంభంపై ఆలోచనలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పథకం విజయవంతం కావాలంటే ప్రజల సాంప్రదాయ నమ్మకాల్ని గౌరవిస్తూ, మాసాంతం వరకు సమయం ఇచ్చే దిశగా ప్రభుత్వం పునర్విమర్శించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల సహకారం కీలకం కావడంతో, ఆదరణ పొందాలంటే అమలులో స్థానిక ఆచారాలకు అనుగుణంగా మార్పులు చేయడం సమయోచితంగా భావిస్తున్నారు.
ముహూర్తం చేస్తే మంచిది కాదు..
ఆషాడంలో ఇంటి నిర్మాణానికి ముహూర్తం చేస్తే మంచిది కాదు అనేది వస్తుంది గూడు లేని మాకు ఇల్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు ఆషాడం ముగిశాక ఇంటి నిర్మాణానికి పూజ చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి.
భాగ్యలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు. సిద్దిపేట.