01-07-2025 01:52:33 AM
అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ
ఏపీ ప్రాజెక్టు ప్రతిపాదన వాపస్.. ఇక తెలంగాణ జాగరూకతతో ఉండాలని నిపుణుల హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమ తులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఊహించని ఎదురుదెబ్బ కాగా.. తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరటగా మారింది. పోలవరం ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డును పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది.
పర్యావరణ అనుమతులకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో సంప్రదింపులు జరపడం అత్యవసరమని కూడా స్పష్టం చేసింది. నీటి లభ్యతపై అంచనాకు రావాలని పేర్కొంది. ఏపీ పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనపై జీకే చక్రపాణి నేతృత్వంలోని ఈఏసీ ఈనెల 17న వర్చువల్‌గా సమావేశమై చర్చించింది.
ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రతిపా దనతో పాటు.. ఈమెయిల్స్, వివిధ మార్గాల్లో వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నది. ఈ ప్రాజెక్టు గోదావరి ట్రైబ్యునల్ 1980 తీర్పునకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ముంపు సమస్య, న్యాయపరమైన అంశాలు ఉన్నాయని తెలిపింది.
సీడబ్ల్యూసీని సంప్రదించి వరద జలాలను సమగ్రంగా అంచనా వేయాలని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ ప్రభావ అంచనా, టీఓఆర్, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారాలకు సీడబ్ల్యూసీని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తిప్పిపంపింది.
ముందుగానే మంత్రి ఉత్తమ్ లేఖ..
ఈఏసీ సమావేశానికి ముందే ఈనెల ౧౬న కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. పోలవరం టీఓఆర్ మార్పులను కేంద్రం తిరస్కరించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు, గోదావరి ట్రైబ్యునల్ నిబంధనలను కాలరాస్తోందని లేఖలో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే ఏపీ ప్రాజెక్టుల విస్తరణకు పాల్పడుతున్నదని ఫిర్యాదు చేశారు.
మొదటినుంచి ఫిర్యాదులు..
పోలవరం-బనకచర్లకు అనుమతులు ఇస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ మొదటినుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ తీరుపై ఫిర్యాదులు చేస్తూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రంపై ఈ అంశంలో పలుమార్లు ఒత్తిడి కూడా తీసుకువచ్చారు.
బీజేపీ సర్కారు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే రాష్ట్రంలోని ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రత్యేకంగా రాష్ట్రానికి చెందిన ఎంపీల కోసం పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రులను అనేకమార్లు కలిసి తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తులు చేశారు.
జాగరూకత అవసరం..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ఒత్తిడి చివరకు ఫలించింది. అయితే, బనకచర్లపై తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న ఫిర్యాదులు, అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఇలా తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినట్లు నీటి పారుదల రంగ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనలు తగ్గించడానికే కేంద్రం ప్రయత్నిస్తున్నదని వారు చెబుతున్నారు.
మరోరూపంలో, తగిన సమయం చూసుకొని బనకచర్ల ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లవ చ్చునని ఆ నిపుణులు అంటున్నారు. తెలంగాణ ప్రభు త్వం ఈ విషయంలో రానున్న రోజుల్లో మరింత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.