01-07-2025 01:57:19 AM
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 30(విజయక్రాంతి): దేశం లో ఫోన్ ట్యాపింగ్ చేయని రాష్ట్రమేదైనా ఉంటే చెప్పాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకు పట్టలేదని.. అదో పనికిమాలిన కేసు అని విమర్శించారు. రేవంత్ తన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పగలరా అని, ఉద్యమంలో తన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందన్నారు.
సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు మీడియా హౌజ్ పేరిట స్లాటర్ హౌజ్‌లు నడుపుతున్నారని, ఈ ఆరాచకమం ఏంటని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడటం ఇష్టం లేని వాళ్లు కేసీఆర్‌పై కక్ష గట్టారని ఆరోపించారు. కోట్లాది మంది హృదయాలు గాయపడ్డపుడు మీడియా హౌజ్‌ల దగ్గర నిరసనలు సహజమన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌లపై ఓ పథకం ప్రకారమే మీడియా హాజ్‌లు కుట్రపూరిత కథనాలు ప్రసారం చేస్తున్నాయని విమర్శించారు. రేవంత్ టూల్ మాత్రమేనని.. మోదీ, చంద్రబాబు చేతిలో ఆయన కీలుబొమ్మ అని మండిపడ్డారు. మహా న్యూస్ పై దాడి జరిగిందని ఎవరికీ తెలియక ముందే చంద్రబాబు స్పందించారని, దీన్ని ద్వారా ముందస్తు ప్రణాళిక ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. కోదండరాం సమైక్యవాదుల నీడలో బతుకుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు.