ఎన్నికల నిర్వహణలో సెక్ట్టార్ అధికారులదే కీలక పాత్ర
జహీరాబాద్, మే 9 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమైనదని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సహాయధికారి, ఆర్డీవో ఎస్. రాజు అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నియోజక వర్గంలోని సెక్టార్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికల రోజున పోలింగ్‌బూత్ వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా నిర్వహించాలన్నారు. ఎన్నిక ల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బం ది ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాక్‌పోలింగ్ సమయానికి కచ్చితంగా జరిగేలా చూడాలని, ఆర్‌ఓ, పీవోలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడింగ్, లైటింగ్, తాగునీరు, అవసరమైన చోట జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
వంద మీటర్ల బయట ఓటరు అసిస్టెంట్ బూత్‌ను ఏర్పాటు చేసి బీఎల్వోలను ఇన్‌చార్జిగా నియమించాలన్నారు. ఎన్నికల అధికా రులు, సిబ్బంది డీఏ, టీఏ చెల్లింపులు, పోల్ రిపోర్టు అందించే బాధ్యత సెక్టార్ అధికారులదే అన్నారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటలలోపే అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని, ముగిసే లోపలే మరల అన్ని కేంద్రాలను సందర్శించాలన్నారు. పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్‌కు ఈవీఎంలను చేర్చే వరకు పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్‌పీవో రాఘవరావు, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






