11-11-2025 08:38:10 PM
ములుగు (విజయక్రాంతి): స్వాతంత్య్రం రాకముందు నిజాం పరిపాలనలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించిన స్టేట్ టీచర్స్ యూనియన్ యొక్క ఆశయాలను నూటికి నూరుపాళ్ళు అమలు చేస్తున్న ములుగు జిల్లా వాస్తవ్యులు ఏళ్ల మధుసూదన్ రాష్ట్ర సంఘ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జీ.సదానంద గౌడ్, జుట్టు గజేందర్ లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సంఘాలకతీతంగా ఉపాధ్యాయులకు అండగా ఉంటూ నిర్విరామంగా జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిష్కార మార్గాలను సూచిస్తూ, అదేవిధంగా జిల్లాలో విద్య అభివృద్ధికి పలు శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ STU సంఘాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించిన ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఏళ్ల మధుసూదన్ మాట్లాడుతూ ఈ బాధ్యతతో తన భుజస్కందాలపై ఇంకా బరువు పెరిగినట్లు గతంలో కంటే మెరుగ్గా జిల్లాలో సంఘాన్ని విస్తరిస్తూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు, STU ములుగు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శిరుప సతీష్ కుమార్, మంచర్ల టవి వీరభద్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.