calender_icon.png 11 November, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివ్వెంల పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీ

11-11-2025 09:01:51 PM

ప్రజా సేవల్లో నాణ్యత పెంచాలని సూచనలు

చివ్వెంల (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్  ఈరోజు చివ్వెంల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది పనితీరును సమీక్షించి, పోలీస్ సేవల నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ ప్రాంగణంలో పిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు. పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, రిసెప్షన్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.

సిబ్బంది సామర్థ్యంతో పౌరులకు మెరుగైన పోలీస్ సేవలు అందించాల్సిన అవసరాన్ని ఎస్పీ నరసింహ గుర్తు చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా విజువల్ పోలీసింగ్ చేయాలని, డయల్ 100 ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టంగా సూచించారు. రాత్రి పూట పెట్రోలింగ్ క్రమంగా నిర్వహించి, జాతీయ రహదారి వెంబడి నిఘా పెంచాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. సిబ్బంది ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ తనిఖీలో ఎస్పీ తో పాటు ఎస్సై మహేశ్వర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.