28-12-2025 12:00:00 AM
ఆపై ఏటీఎంలను తగులబెట్టిన దుండగులు
మహారాష్ట్రకు చెందిన దోపిడీ ముఠా పనే?
అనుమానిస్తున్న పోలీసులు
నిజామాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలో రెండు చోట్ల ఏటీఎంలను లూటీ చేసిన దుండగులు.. ఆపై ఎలాంటి ఆధారాలు దొరక్కుండా వాటిని తగులబెట్టారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజా మున జరిగింది. దోపిడీల్లో ఆరితేరిన ఈ ముఠా గంటన్నర వ్యవధిలోనే రెండు ప్రాంతా ల్లో ఏటీఎంల దోపిడీకి పాల్పడింది. దాదాపు రూ.37 లక్షలు లూటీ చేసినట్టుగా తెలుస్తోంది.
మొదట నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్డు సాయి నగర్ వద్ద మెయిన్ రోడ్‌లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. ఏటీఎంలోని డబ్బునంత దోచుకున్న తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. సెలవుల సందర్భంగా బ్యాంక్ సిబ్బంది రెండు రోజుల క్రితమే ఏటీఎంలో సుమారు రూ.పది లక్షలకు పైగా నగదు జమ చేసినట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత ముఠా నేరుగా నిజామాబాద్ దగ్గర శివారులోని పాంగ్ర ప్రధాన కూడలి హైదరాబాదు రోడ్డులో గల జిల్లా సహకార బ్యాంకుకు చెందిన ఏటీఎంలో దోపిడీకి పాల్పడ్డారు. ఇక్కడ రూ.27 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దోపిడీ అనంతరం ఈ ముఠా ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు సహకార బ్యాంకు ఏటీఎంను కూడా తగలబెట్టారు.
పూర్తిగ తెల్లవారిన తర్వాత సమాచారా న్ని అందుకున్న అదనపు డీసీపీ బసవరెడ్డి, ఏసీపీ రాజావెంకటరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గంటన్నర వ్యవధిలోనే దోపిడీకి పాల్పడ్డ ఈ ముఠాను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. దోపిడీ కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ మీదుగా బాన్సువాడ నుంచి క్రెటా కారులో నిజామాబాద్ నగరానికి చేరుకొని దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ వాహనంలో ఐదుగురికి పైగా ముఠా ఉన్నట్టు సమాచారం. అనంతరం దుండగులు ఆర్మూర్ వైపు పారిపోయినట్టు తెలుస్తున్నది. ఈ దోపిడీ ముఠా మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠా గుట్టు రట్టు చేసేందుకు నిజామాబాద్ పోలీసులు ఐదు స్పెషల్ టీం లను ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. నిజామాబాద్ ఇంచార్జ్ కమిషనర్ రాజేష్ చంద్ర ఏటీఎంలను సందర్శించారు. దోపిడీ ముఠా ఆడవాళ్లను వేలిముద్రలను వారు పారిపోయిన రహదారిలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు.