28-12-2025 12:00:00 AM
సంగారెడ్డి, డిసెంబర్ 27(విజయక్రాంతి): రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసి వైజా గ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి 20 మంది ఎంపీలను గెలిపించి రూ.2.50 లక్షల కోట్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు అనే నినాదానిది ఒక చరిత్ర ఉందన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం వల్లే వెంకయ్య నాయుడు జాతీయ స్థాయి నేతగా ఎదిగారని గుర్తు చేశారు.రూ.14 వేల కోట్లతో ఇందిరాగాంధీ ప్రారంభించిన విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడు రూ.2.50 లక్షల కోట్ల సంపదకు చేరిందన్నారు.
విలువైన విశాఖ ఉక్కుపై మోదీ కన్నుపడిందని దురుద్దేశంతో ఎవరికో కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్నా రని జగ్గారెడ్డి ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటంలో మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబులు ఇద్దరూ విఫలమయ్యారన్నారు. 2029 లో ఏపీ నుంచి 20 మంది ఎంపీలను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. తెలంగాణ విభజన సమయంలో తాను ఒక్కడినే విభజన చేయవద్దని చెప్పానని జగ్గారెడ్డి తెలిపారు. అందుకే ఏపీలో మాట్లాడేందుకు నాకు పూర్తి హక్కులు ఉన్నాయన్నారు.