calender_icon.png 5 December, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోయగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిపై దాడి

05-12-2025 10:31:11 PM

నామినేషన్ కేంద్రంలోనే కొట్టారని ఆరోపణ

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం సుకాల్ బోడు నామినేషన్ల కేద్రం వద్ద కోయగూడెం పంచాయతీ బీఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థి పూనెం కరుణాకర్ పై కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, ఆయన భార్య ఉమా శుక్రవారం దాడి చేసి కొట్టారని కరుణాకర్ విలేఖరులకు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నామినేషన్లకు చివరి రోజు కావడంతో రెండో నామినేషన్ వేసేందుకు కరుణాకర్ కేంద్రం వద్దకు వచ్చి వరుసలో నిలబడ్డాడు.

అదే సమయంలో అక్కడకు వచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, ఆయన భార్య ఉమ వచ్చి నామినేషన్ ఎందుకు వేస్తున్నావంటూ ఘర్షణకు దిగి అయ్యప్ప మాల వేసి ఉన్న కరుణాకర్ పై చేయి చేసుకున్నారన్నారు. ఎలా పోటీ చేస్తావు, బయటకు రా నీ అంతు చూస్తా చంపేస్తామంటూ బెదిరించారని తెలిపారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వార్డు సభ్యులను కూడా బెదిరించి పంపించారని ఆరోపించారు. వెంటనే 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. సురేందర్ తో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆయన కోరారు. 

ఇది ప్రజా స్వామ్యమా.. లేక ఏంటి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ 

నామినేషన్ వేసేందుకు వచ్చిన తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి పూనెం కరుణాకర్ ను ఎమ్మెల్యే కోరం కనకయ్య సోదరుడు కోరం సురేందర్, మాజీ సర్పంచ్ పూనెం ఉమలు దాడి చేసి కొట్టారని విలేకరులతో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎక్కడ ఉన్నామని ప్రశ్నించారు. తాము పోటీలో నిలబెట్టిన అభ్యర్థి ఓడి పోతున్నదని బయపడి దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. ఈ సందర్బంగా ఎన్నికల అధిరారికి, పోలీసులకు, జిల్లా కలెక్టర్ కు, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు  చేస్తున్నట్లు తెలిపారు.

సమస్యాత్మక గ్రామంగా కోయగూడెం పంచాయతీ ఉండగా నామినేషన్ల కేంద్రంలో కనీసం సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల నామినేషన్ల కేంద్రంలో దాడులు చేస్తే రక్షణ ఎక్కడ ఉందన్నారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో నామినేషన్ తీసుకునే ఎన్నికల అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు బానోత్ హరిసింగ్, వరప్రసాద్, బానోత్ రామ, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.