calender_icon.png 5 December, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్లైన్‌ బెట్టింగ్‌కి యువకుడు బలి

05-12-2025 10:33:50 PM

అప్పుల బారిన ఉపేందర్ ఉరి – కుటుంబంలో కన్నీరుమున్నీరూ

చివ్వెంల,(విజయక్రాంతి): ఆన్లైన్ బెట్టింగ్, పేకాట వ్యసనం మరో కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచింది. చివ్వెంల మండలం కుడకూడ గ్రామానికి చెందిన భూతరాజు ఉపేందర్ (28) అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెంట్రింగ్ వర్క్ చేస్తూ జీవనోపాధి పొందుతున్న ఉపేందర్, కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్, పేకాట వ్యసనంతో తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయాడు. గతంలో కూడా భారీ అప్పుల కారణంగా తన భూమిని విక్రయించి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ వ్యసనం మళ్లీ పట్టి, కొత్తగా మరోసారి పెద్ద మొత్తంలో అప్పులు చేరాయి.

అప్పుల ఒత్తిడి పెరిగిపోవడంతో మానసికంగా విసిగిపోయిన ఉపేందర్, 04-12-2025 తేదీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని జీవితాన్ని ముగించుకున్నాడు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదనతో విలపించారు. మృతుడికి భార్య ఝాన్సి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా కోల్పోవడంతో వారి భవిష్యత్తు చీకటిలో మునిగిపోయింది. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై భార్య ఝాన్సి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.