01-08-2025 12:40:23 AM
మహబూబాబాద్, జూలై 31 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల ఉపేందర్ శిరీష దంపతుల కుమారుడు ఆరేళ్ల వయసు గల మనీష్ కుమార్ పై గురువారం తెల్లవారుజామున దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఇంట్లో తల్లిదండ్రులు, నాయనమ్మ తో కలిసి నిద్రిస్తున్న మనీష్ కుమార్ మెడ పై తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. దీనితో అతని మెడపై తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనతో బాలుడు కేకలు వేయడంతో నాయనమ్మ నిద్ర నుండి మేలుకొని తల్లిదండ్రులను కూడా లేపడంతో వెంటనే బాలున్ని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. తనకు ఎవరితోని ద్వేషాలు లేవని, తన కొడుకును ఎందుకు చంపాలనుకుంటున్నారో కూడా తెలియదని తల్లిదండ్రులు చెబుతుండగా, ఇంటి తలుపు గడియ లేని విషయం దుండగులకు ఎలా తెలుసుకున్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఘటనపై మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం రెండవ ఎస్ ఐ నరేష్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలున్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పరామర్శించారు. ఘటనకు పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అభం శుభం ఎరుగని బాలుడి పై దాడికి పాల్పడ్డ ఘటన ఆ గ్రామంలో తీవ్ర కలకలం సృష్టించింది.