కొడుకుపై హత్యాయత్నం
భార్య తిరిగి రావాలని కన్నతండ్రి కర్కశం
వికారాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కొడుకు పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. తనమీద అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య ఎంతకీ తిరిగిరాకపోవడంతో తన వద్ద ఉంటున్న కొడుకును చంపితేనైనా వస్తుందనే క్రూరత్వంతో కొడుకునే చంపేందుకు యత్నించాడు. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
పోలీసులు తెలిపిన ప్రకారం తాండూరు మండలం మల్కాపూర్‌కు చెందిన మల్కేడ్ హన్మంతుకు భార్య, ముగ్గురు పిల్లలు. హన్మంతు నిత్యం భార్యతో గొడవపడేవాడు. ౨ నెలల కింద ఆమె అతన్ని వదిలేసి ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది. పెద్ద కొడుకు అరవింద్(14) తండ్రి వద్దే ఉం టున్నాడు. భార్య తిరిగిరాకపోవడంతో హన్మంతు మనసులో దుర్మార్గమైన ఆలోచన వచ్చింది.
తన కొడుకు అరవింద్‌ను చంపితే భార్య తిరిగి వస్తుందని సోమవారం.. కత్తితో అరవింద్ చేతులపై, మెడపై దాడి చేశాడు. అయితే అరవింద్ అరుపులు విన్న స్థానికులు హన్మంతు నుంచి అతడిని విడిపించారు. అనంతరం గాయపడిన అరవింద్‌ను తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు హనుమంతుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్ రెడ్డి తెలిపారు.






