3 May, 2026 | 4:27 AM

పెండింగ్ బిల్లులపై చర్చించాలి

10-12-2024 12:34 AM

మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచుల ఆందోళన

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరపాలని మాజీ సర్పంచ్‌ల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న కార్యాలయంలో ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు సోమవారం పలువురు మాజీ సర్పంచ్‌లు ప్రయత్నించారు.

ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి సాయినాథ్‌గంజ్ పీఎస్‌కు తరలించారు. యాదయ్యగౌడ్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయడం తగదన్నారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ప్రతిరోజూ ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం జేఏసీ ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, మాట్ల మధు, కేశబోయిన మల్లయ్య, నెమలి సుభాష్‌గౌడ్, వేపూరి విజయలక్ష్మి, బొల్లం శారద పాల్గొన్నారు.

సర్పంచులపై కక్ష సాధింపు చర్యలా: మాజీ మంత్రి హరీశ్‌రావు

తాజీ మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మాజీ సర్పంచులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గమన్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు హైదరాబాద్‌కు వచ్చి మొర పెట్టుకుని.. నిరసనలు తెలిపితే నిర్బంధం, అరెస్టులు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారన్నారు. ఉత్తమ గ్రామాలకు తెలంగాణ కేరాఫ్‌గా నిలిచి అవార్డులు సాధించడంలో సర్పంచుల పాత్రే కీలకమని పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు రూ.వందల కోట్ల బిల్లులు చెల్లిస్తూ.. పనులు చేసిన పాపానికి సర్పంచులకు శిక్ష వేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ లేదా పంచాయతీ శాఖ మంత్రి సీతక్క మాజీ సర్పంచులను చర్చలకు పిలిచి పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.