calender_icon.png 4 November, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుదింపు చర్యలు విరమించుకోవాలి

04-11-2025 12:05:23 AM

- కామన్ స్కూల్ విధానం అమలు చేయాలి 

- డిటిఎఫ్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు పి శంతన్ 

అర్మూర్ నవంబర్03, (విజయ క్రాంతి): జనాభా పెరుగుదల ప్రాతిపదికన  రాష్ర్టంలో ప్రస్తుతమున్న పాఠశాలలకు అధనంగా మరిన్ని పాఠశాలలు నెలకొల్పవలసిన అవసరం ఉన్నా రాష్ర్ట ప్రభుత్వం అందుకు విరుద్ధంగా విద్యా కమిషన్ సిఫారసుల పేరిట  ప్రస్తుతమున్న పాఠశాలలను పెద్ద ఎత్తున కుదించి వేయడానికి చేస్తున్న  చర్యలు  పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేయడమేనని  ఈ ప్రజా వ్యతిరేక చర్యలను తక్షణమే విరమించుకోవాలని డిటిఎఫ్ రాష్ర్ట ఉపాధ్యక్షులు పి. శంతన్ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం రోజు సభ్యత్వ నమోదులో భాగంగా ఆర్మూర్ మండలంలోని వివిధ పాఠశాలలను మండల కమిటీ నాయకులతో పర్యటించి వివిధ పాఠశాలలలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ   రాష్ర్ట ప్రభుత్వం ఆధీనంలోనే ప్రజల పిల్లలందరికీ నాణ్యమైన ఉచితమైన విద్యనందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా విద్య రంగానికి బడ్జెట్లో15శాతం నిధులు కేటాయించాలని,ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్న విద్యా రంగ లక్ష్యాలు నెరవేరాలంటే కామన్ స్కూల్ విద్యా విధానం ఒకటే పరిష్కార మార్గం అని ఈ విధానాన్ని రాష్ర్టంలో సమర్థవంతంగా అమలు చేయాలని డాక్టర్ డిఎస్ కొఠారి కమిషన్ 1966 లోనే కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలకు సూచించిందని కానీ నేటికీ ప్రభుత్వాలు కామన్ స్కూల్ విధానం అమలు చేయాలనే ఆలోచన చేయకపోవడం సరికాదని ఇప్పటికైనా కామన్ స్కూల్ విధానం పై దృష్టి సారించాలని  శంతన్ రాష్ర్ట ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు. 

పి ఆర్ సి గడువు ముగిసి 28 నెలలు గడిచిన కూడా నేటికీ పిఆర్సి ఉసే లేదని తక్షణమే నివేదికను తెప్పించుకొని 51శాతం ఫిట్మెంట్ తో  పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను విడుదల చేయాలని, విద్య రంగానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బడ్జెట్లో15శాతం నిధులను కేటాయించాలని,బదిలీల పదోన్నతులకు ప్రత్యేకంగా కోడును రూపొందించి షెడ్యూల్ ప్రకారం ప్రతి సంవత్సరం బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, తక్షణమే పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసి పదోన్నతులు కల్పించాలని, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల ఉద్యోగుల అన్ని రకాల బెనిఫిట్స్ తో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల ఉద్యోగుల వివిధ రకాల బిల్లులను  తక్షణమే చెల్లించాలని రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఒమాజి మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్  చెల్లించాలని,98పర్సెంట్ ఖాళీగా ఉన్న పర్యవేక్షణ అధికారుల పోస్టులు అయిన మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ డిఇఓ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, 30 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని  కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, 398/వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్ల సర్వీస్ కు ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని,సి పి ఎస్ విధానము  రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ ను పునరుద్ధరించాలని, గత మూడేళ్లుగా నిలిచిపోయిన కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని, రాష్ర్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేటి పర్యటన సందర్భంగా జెడ్ పి ఎస్ ఎస్ మామిడిపల్లి, జెడ్పిఎస్‌ఎస్ పెర్కిట్, జెడ్ పి హె ఎస్ చేపూర్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, మోడల్ స్కూల్ పాఠశాల, తదితర పాఠశాలలలో ఉపాధ్యాయులను సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. ఈ  పర్యటనలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు రాసరి పెంటన్న, కార్యదర్శి ఏక్ నాథ్ మండల నాయకులు, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.