04-11-2025 02:07:40 PM
							హైదరాబాద్: అరేబియా సముద్రం(Arabian Sea) నుంచి తేమ గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) ప్రకటించింది. రాష్ట్రంలో సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు కురిసే అవకాశముంది. ఇవాళ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఎల్లుండి నుంచి పొడి వాతావరణం కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎనుమాముల మార్కెట్లో పత్తి, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ
తెలంగాణ వాసులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, మిశ్రమ వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ, గద్వాల ప్రాంతాల్లోని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనప్పుడు సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అడపాదడపా కురిసే అవకాశం ఉంది. వాతావరణ పరిణామాలపై ప్రతి ఒక్కరూ తాజాగా ఉండాలని, ప్రతికూల వాతావరణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు వెల్లడించారు.