01-05-2025 12:11:13 AM
హనుమకొండ, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాయి కంటి రఘు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ధర్నా నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ అర్హులైన ఆటో డ్రైవర్లకు రూపాయలు 12,000 వేలు జీవన భృతి ఇవ్వాలని, ఆటో డ్రైవర్ల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జిల్లాకో ఆటో భవన్ నిర్మించాలని అన్నారు. ఆటో డ్రైవర్ల సహజ మరణానికి రూపాయలు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఎం వి యాక్ట్ 2019 ప్రకారం సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ధర్నాలో యూనియన్ రాష్ట్ర సలహాదారు ముగుసాల దేవేందర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అంకుశావళి జిల్లా నాయకులు సయ్యద్ గౌస్ పాషా, ఎండి యాసిన్ కాజా, జక్కుల శ్రీనివాస్ ఆనంద్, సుమన్, పైండ్ల రవీందర్ తదితర ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.