24-10-2025 12:00:00 AM
అశ్వాపురం, అక్టోబర్ 23 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం మిట్టగూడెం లోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గురు వారం గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ పద్ధతి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశ్వాపురం ప్రాథమిక వైద్యుడు డాక్టర్ శివకుమార్ విద్యార్థులకు సిపిఆర్ చేయవలసిన విధానాన్ని ప్రాయోగికంగా చూపించారు.
డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ.. గుండె కొట్టుకోవడం ఆగిపోవడం (ఎస్‌సీఏ) వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతిని నేర్చుకోవడం అత్యవసరమని, దానివల్ల కార్డియాక్ అరెస్టు కారణంగా జరిగే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ రవి, అధ్యాపక సిబ్బంది, 108 అంబులెన్స్ సిబ్బంది సుజాత, రాము పాల్గొన్నారు. విద్యార్థులు సిపిఆర్ పద్ధతి ప్రదర్శన లో ఉత్సాహంగా పాల్గొని, గుండెపోటు సమయంలో చేయవలసిన చర్యలపై అవగాహన పొందారు.