13-08-2025 07:16:14 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): అవయవదానంపై అవగాహన కల్పించేందుకు అపోలో రీచ్ హాస్పిటల్(Apollo Reach Hospital) ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కరీంనగర్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఎనమల్ల నరేష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ, “మెదడు మరణం” (బ్రెయిన్ డెత్) యొక్క అర్థం, నిర్ధారణ విధానం, పరీక్షలు, అలాగే అవయవ సేకరణ ప్రక్రియపై వివరణ ఇచ్చారు. దేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది అవయవాల కొరత కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ఒకే దాత 8 మందికి ప్రాణం పోసి, 50 మందికి పైగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచగలడని తెలిపారు.
మరణానంతరం కంటి, గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలను దానం చేయవచ్చని చెప్పారు. అవయవ దానానికి ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేయడం,ఫారమ్ నింపడం, దాత కార్డు పొందడం ముఖ్యమని వివరించారు. “మరణానంతరం మన శరీరం మట్టి అవుతుంది కానీ అవయవ దానం చేస్తే మరొకరికి జీవం అవుతుంది” అని పరిపాలనాధికారి డాక్టర్ నాగ సతీష్ కుమార్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ పుట్ట, డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి, డాక్టర్ వేముల పరమేశ్వర్, డాక్టర్ యజ్ఞమునేష్, డాక్టర్ సునీల్, ఇతర వైద్య బృందం పాల్గొన్నారు.