calender_icon.png 14 August, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టికటింగ్

14-08-2025 12:44:26 AM

-ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చేతివాటం 

-టికెట్లివ్వకుండా తనిఖీల్లో పట్టుబడుతున్న కండక్టర్లు

గత మే 3న కరీంనగర్ డిపోకు చెందిన జేబీఎం ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరింది. 33 మంది ప్రయాణికులు హైదరాబాద్ వెళ్లేందుకు టికెట్లు తీసుకోగా అందులో 11 మందికి డ్రైవర్ నకిలీ టికెట్లు ఇచ్చి రూ.3,740 తన జేబులో వేసుకున్నాడు.

ఇందులో 5గురికి అప్పటికే జారీ చేసి న టికెట్లను తిరిగి ఇవ్వగా.. మిగతా ఆరుగురికి టిమ్ పనిచేయడం లేదని తెల్లకాగితం మీద రాసిచ్చాడు. నగరంలోని బొల్లారం వద్ద తనిఖీ అధికారులు వచ్చి చెక్ చేస్తే అస లు విషయం బయటపడింది. దీంతో విస్తుపోవడం అధికారుల వంతయింది. తెల్లవారుజామున చెకింగ్ అధికారులు ఏం వస్తారులే అనే ధీమాతో ప్రైవేట్ డ్రైవర్ ఈ తతంగం చేసినట్టు అధికారులు అంచనాకు వచ్చారు.. కేసు నమోదు చేశారు.

నిజామాబాద్ డిపో చెందిన జేబీఎం సంస్థ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్‌పై ఇలాంటి కేసే నమోదు అయింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా..  తనిఖీ అధికారులు ఈ అవినీతి డ్రైవర్‌ను పట్టుకున్నారు.  వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న జేబీఎం బస్సు డ్రైవర్‌పైనా ఇలాంటి కేసే నమోదైంది. 

నగరంలోని వివిధ మార్గాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నడిపే పుష్పక్ బస్సుల డ్రైవర్లు కూడా ప్రైవేటు వాళ్లే. వారంతా వన్‌మ్యాన్ సర్వీసు నిర్వహిస్తారు. అర్ధరాత్రి తనిఖీలకు ఎవరు వస్తారులేనన్న ధీమాతో కొందరు డ్రైవర్లు టిక్కెట్లు జారీ చేయకుండా స్వాహా చేసే ప్రయత్నం చేస్తే తనిఖీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు పెట్టారు.

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఆర్టీసీలో నడుస్తున్న ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులకు కండక్టర్లు లేకుండా డ్రైవర్లే వన్‌మ్యాన్ సర్వీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఎలా గూ ఉద్యోగ భద్రత ఉంటుందనే భరోసా ఉండదు. ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సులు కావడంతో ఓనర్‌కు నచ్చనప్పుడు ఎప్పుడైనా తీసేసే అవకాశం ఉంటుంది. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే తాపత్రయంతో కొందరు అక్రమార్కులు చేతివాటానికి పాల్పడు తున్నారు.

ఫలితంగా ఆర్టీసీకి పెద్దఎత్తున నష్టం వచ్చే పరిస్థితి తలెత్తింది. ఆర్టీసీ సిబ్బంది అయితే ఒక్క రూపాయి తేడా వచ్చినా తనిఖీల్లో దొరికితే ఉద్యోగం తీసేస్తారనే భయంతో పనిచేస్తారు. అలాంటి భయమేమీలేని ప్రైవేట్ బస్సుల ప్రైవేటు డ్రైవర్లకు అడ్డేముంది..! అందుకే రాత్రి సర్వీసులు, తెల్లవారుజామున నడిచే సర్వీసులకు సంబంధించిన కొందరు డ్రైవర్లు ఇలాంటి అవినీతి పనులకు పాల్పడుతున్నట్టుగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. అందుకే ఇటీవల 24 గంటల పాటు ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. ఫలితంగా చేతివాటం చూపిస్తున్న ప్రైవేటు బస్సుల డ్రైవర్లు దొరికిపోతున్నారు. 

3038... 3038

ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీ అని చెప్పిచెప్పి అలసిపోయిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నోటి నుంచి గతకొంత కాలంగా ఆ మాట వినపడటం లేదు. తాజాగా ఆర్టీసీ ఎండీ ఆ పల్లవి అందుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామం టూ కొందరు మోసం చేస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు 3,038 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభమైందని ఈనెల 7న ప్రకటించారు.

ప్రభుత్వం ఏర్పడినప్పటి నుం చి అదిగో ఇదిగో అంటున్నా.. సర్కారు ఏర్ప డి 20 నెలలు అవుతున్నా... ఇంకా ఆ ఊసే లేకుండా పోయింది. పైపెచ్చు ఔట్‌సోర్సింగ్, ప్రైవేటు డ్రైవర్ల చేతికి క్యాష్ బ్యాగ్ అందించడంతో అంతంతమాత్రంగా ఉన్న క్యాష్ కలెక్షన్ కాస్త మధ్యలోనే గాయబ్ అవుతోం ది. త్వరగా ఆర్టీసీలో నియామకాలు చేపట్టి ఉద్యోగంపై బాధ్యత ఉన్న వ్యక్తులకే టికెట్లు జారీచేసేలా నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ అవినీతికి చరమగీతం పాడటం కష్టమని రవాణా రంగ నిపుణులు అంటున్నారు. 

ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే ఎలా..

ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల పేరిట పెద్దఎత్తున ప్రైవేటు బస్సులు ఆర్టీసీలో పెరిగిపో యాయి. కనీసం వాటికి డ్రైవర్లు బయటి వ్యక్తులున్నా.. టికెట్లు జారీ చేసేందుకు అయినా ఆర్టీసీకి చెందిన రెగ్యులర్ కండక్టర్లు ఉండాలి. అలా కాకుండా ప్రైవేటు డ్రైవర్లకే అవకాశం ఇస్తే వారు అవినీతికి పాల్పడేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులకు చెందిన డ్రైవర్లు ఇలా అనేక మంది పట్టుబడ్డారు. అందుకే ప్రైవేటు వ్యక్తులకు టికెట్ డబ్బుల వ్యవహారం అనేది సరికాదు. దానికి సంబంధించి న బాధ్యత రెగ్యులర్ ఉద్యోగులకే అప్పగించాలి. ప్రైవేటు వ్యక్తులకు, ఔట్‌సోర్సింగ్ కండక్టర్లకు ఈ బాధ్యతలను అప్పగిస్తే ఆర్టీసీ సొమ్మును దోపిడీ చేసేందుకు అవకాశం ఉంటుంది. యాజమాన్యం స్పందించి రెవెన్యూ డ్యూటీ లు తప్పనిసరిగా రెగ్యులర్ ఉద్యోగులకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 ఈదురు వెంకన్న, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి