01-01-2026 01:20:39 AM
అట్రాసిటీ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి
అధికారులకు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశం
కేసుల విచారణను వేగవంతం చేస్తాం: ఎస్పీ నితిక పంత్
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ నితిక పంత్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి అట్రాసిటీ కేసులపై అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో అట్రాసిటీపై 32 కేసులు నమోదయాయని, 29 కేసులలో బాధితులకు 20 లక్షల రూపాయల పరిహారం మంజూరు అయిందని, ఈ నగదు బాధితుల బ్యాంకు ఖాతాలలో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి నెల 30వ తేదీన గ్రామాలలో స్థానిక తహసీల్దార్, ఎస్ ఐ., ఇతర అధికారులతో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి చట్టాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కుల వివక్ష లేకుండా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.ఎస్. పి. మాట్లాడుతూ అట్రాసిటీ కేసులపై పూర్తి స్థాయి విచారణ జరిపి నేరం చేసిన వారికి శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తున్నామని, అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డి.ఎస్.పి., షెడ్యూల్ కురముల అభివృద్ధి అధికారి అశోక్, సత్యజిత్ మండల్, జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మానిటరింగ్ కమిటీ సభ్యులు కేశవరావు, అశోక్, పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భావన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి లతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహి ళా సాధికారత కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వీర్ బాల్ దివస్ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్య సించాలని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, ఉపన్యాస, వ్యాసరచన, రంగోలి, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, బాలల సంరక్షణ అధికారి మహేష్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, సభ్యులు రాణి, మమత, సఖి సిబ్బంది పాల్గొన్నారు.