31-12-2025 06:28:38 PM
వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ నాయక్
హనుమకొండ,(విజయక్రాంతి): వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు లునావత్ నరేంధర్ నాయక్ అధ్యక్షతన విద్యార్థులకు విద్య విలువపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వర్ణ భారతి యూత్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పాలడుగుల సురేందర్ విచ్చేసి మాట్లాడుతూ... బాల్యం నుంచే పిల్లలు శ్రద్ధగా చదువుకుని, వృద్ధిలోకి రావాలని, చదువుకు పేదరికం ఎప్పుడు అడ్డుకారాదని అన్నారు.
ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రాథమిక విద్యాభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని ఉపయోగించుకుని విద్యార్థులు చదువుతోపాటు, ఆటపాటలు వంటి కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు.అలాగే సెల్ ఫోన్ వాడకం తగ్గించి జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలన్నారు. తప్పుడు మార్గాలు అనుసరించకుండా సన్మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా విద్య ఒక్కటే ప్రధాన ఆయుధంగా ముందుకు సాగాలని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ నాయక్ మాట్లాడుతూ.. తాము చదువుకున్న కాలంలో ఇటువంటి సౌకర్యాలు లేకపోయినా కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ శ్రద్ధతో ఓర్పుతో చదువుకొని ఉపాధ్యాయునిగా, కాకతీయ అక్షర దీపికలో ఉత్తమ ఎమ్మెల్యేగా, ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా, గురువుల సహకారంతో బాల్ బ్యాట్మెంటన్ కెప్టెన్ గా, భారతదేశానికి మొట్టమొదటి అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్య తో సైతం వివిధ కార్యక్రమాలు చేయగలిగి మహిళల అక్షరాస్యత కోసం అనేక ఏళ్లు కృషిచేసిన సందర్భంగా నేటి బాలలే రేపటి పౌరులు గనుక బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో అవకాశాలను వినియోగించుకొని అందరూ వృద్ధిలోకి రావాలని సూచించారు.
చదువుకోవాలని కసి పెంచుకొని ఇతర అనవసరపు అలవాట్ల పట్ల మొగ్గు చూపకుండా విద్య వైపు అడుగులు వేసి అభివృద్ధి సాధించాలని తెలిపారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో తాను ఎప్పుడు ముందుంటానని అన్నారు. అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక హనుమకొండ ప్రతినిధి కోడిపాక శ్రీకాంత్ మాట్లాడుతూ... విద్యార్థులు పాఠశాలకు వచ్చాక అనునిత్యం చదువుకునే లక్ష్యంతోనే ముందుకు సాగాలని ఇతర సమస్యలకు బానిసలు కావద్దని, జీవితంలో గొప్పగా ఎదగాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని అన్నారు.