31-12-2025 08:00:56 PM
వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు
గ్రోమోర్, పీఎసీఎస్ సెంటర్ ల సందర్శన
చిట్యాల,(విజయక్రాంతి): రైతులకు యూరియా కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు అన్నారు. బుధవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ ను, పిఎసిఎస్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు యూరియా కోసం బారులు తీరిన క్యూలైన్లలో నిలబడకుండా, యూరియా కోసం పడిగాపులు కాయకుండా ఇంట్లో నుండే సులువుగా ఏ ఎరువుల కేంద్రంలో ఎంత యూరియా ఉందో తెలుసుకొని తమకు ఎంత యూరియా అవసరమో అంత యూరియాను బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యూరియా యాప్ ను తీసుకు వచ్చింది.
దీనివల్ల రైతులకూ యూరియా కష్టాలు ఇక ఉండబోవని అన్నారు. అంతేకాకుండా యూరియా ఏ ఏ సెంటర్లలో ఎంత మొత్తం నిల్వ ఉందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని తమకు నచ్చిన డీలర్ వద్ద నుండి యూరియాను నేరుగా పొందవచ్చునని సూచించారు. ప్రతి ఒక్క రైతు ఈ యాప్ ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారానే యూరియాను సులువుగా పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, నకరికల్ వ్యవసాయ సహాయ సంచాలకులు జానీ మియా, మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు, ఏఈఓ వాసుదేవ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.