31-12-2025 07:54:45 PM
జై భీమ్ వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్ కుమార్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి జంక్షన్ నుంచి అంబేద్కర్ రోడ్డు వరకు ఏర్పాటు చేసే హైటెన్షన్ విద్యుత్తు లైన్ ఏర్పాటు చేయవద్దని జై భీమ్ వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్ కుమార్, 58 డివిజన్ కార్పొరేటర్ ఇమ్మడి లోహితరాజు లు డిమాండ్ చేశారు. బుధవారం వడ్డేపల్లి జంక్షన్ వద్ద రోడ్డు మధ్యలో ఏర్పాటు చేస్తున్న ఐటెన్షన్ విద్యుత్ స్తంభాలను వెంటనే నిలిపివేసి రోడ్డు పక్కకు వేసి ప్రమాదాలను అరికట్టాలని స్థానికులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్తంభాలను రోడ్డుకు చివర వేయాలన్నారు.
రోడ్డు మధ్య నుంచి వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో స్తంభాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్తు అధికారులు పరిశీలించి హైటెన్షన్ విద్యుత్ స్తంభాలను రోడ్డు పక్కన వెయ్యాలని కోరారు. ఈ నిరసనలో జై భీమ్ జిల్లా ప్రతినిధులు ఇల్లందుల భాస్కర్, తాళ్లపల్లి సుధాకర్, తాళ్లపల్లి రాజకుమార్, సేవాలాల్ సేవా జిల్లా అధ్యక్షులు మురళి నాయక్, వడ్డేపల్లి కళకారుల సంఘం ప్రతినిధి ఇమ్మడి సందీప్, వడ్డేపల్లి ఆటో యూనియన్ నాయకులు జి. శంకర్ నాయక్, ఎల్తుర్తి సదయ్య తదితరులు పాల్గొన్నారు.