calender_icon.png 31 December, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి

31-12-2025 08:15:04 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జనవరి 1, 2026 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్.పి. నితిక పంత్ తో కలిసి పోలీస్, రెవెన్యూ, జాతీయ రహదారులు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, రహదారులు భవనాలు, విద్య, వైద్య, కార్మిక, రవాణా, విద్యుత్, మున్సిపల్, ఆర్. టి. సి. శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి భద్రత మాసోత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో, కళాశాలలో రోడ్డు భద్రత, రహదారి నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వాహనాల డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహన చోదకులకు వాహన వేగ నియంత్రణ, సీట్ బెల్టు/ హెల్మెట్ ధరించడం, మద్యం తాగి వాహనం నడపడం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాలలో, కళాశాలలో రహదారి భద్రతపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని తెలిపారు.

జాతీయ రహదారుల సంస్థ అధికారులు జాతీయ రహదారులపై ప్రమాద ప్రాంతాలను గుర్తించి వేగ నియంత్రణ కొరకు ఏర్పాట్లు చేయాలని, వాహన చోదకులకు అర్థమయ్యే విధంగా బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు తమ పరిధిలోని రహదారులలో ప్రమాదాలు జరగకుండా అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు. నెల రోజులపాటు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

ఎస్. పి. మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరిగే 10 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, 2024 సంవత్సరం కంటే 2025 సంవత్సరంలో ప్రమాదాల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుని రహదారి భద్రత మాస ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ మణికుమార్, కాగజ్ నగర్ డి.ఎస్.పి., సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.