05-04-2025 05:17:15 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధుడు, దళిత జన బాంధవుడు, సమత వాది, సంఘసంస్కర్త, బహుజన వర్గాల ఆశాజ్యోతి డా.బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం డా. బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆర్డిఓ లోకేశ్వర్ రావు, జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులతో కలిసి హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుడు, దళితుల వికాసం కోసం నిర్విరామంగా కృషి చేసిన మహనీయుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, భారత ఉప ప్రధానిగా వివిధ పదవులలో దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. హరిత విప్లవం తీసుకురావడంలో ముందు వరుసలో ఉన్నారని, ఆనాడు బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఫలితంగా నేడు మూఢనమ్మకాల వంటి అంశాలపై ప్రజలకు అవగాహన ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమంలో ఆదర్శాలను ఆచరణలో చూపి పూర్తిగా నిలిచిన మహనీయుల చరిత్ర భావితరాలకు అందించాలని, వారు చూపిన సన్మార్గాలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు.