calender_icon.png 2 May, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్య మళ్లీ ‘ప్చ్’ అనిపించారా..? లేకా..!

01-05-2025 07:19:48 PM

సినిమా: రెట్రో; 

నాయకానాయికలు: సూర్య, పూజా హెగ్డే; 

ఇతర ప్రధాన తారాగణం: జయరాం, జోజుజార్జ్, నాజర్, ప్రకాశ్‌రాజ్, కరుణాకరన్, సుజిత్‌శంకర్; 

బ్యానర్స్: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్; 

దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు; 

సంగీతం: సంతోష్ నారాయణ్; 

సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ; 

ఎడిటర్: షఫీఖ్ మహ్మద్ ఆలీ; 

నిర్మాతలు: సూర్య, జ్యోతిక; 

పంపిణీదారు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్; 

విడుదల తేది: మే 1 

విభిన్న చిత్రాలు, పాత్రలతో ఆకట్టుకునే ప్రముఖ నటుడు సూర్య. ఆయన హీరోగా ఇంతకుముందు వచ్చిన ‘కంగువ’ చిత్రం మిశ్రమ ఫలితాలు దక్కించుకుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా గురువారం విడుదలైన సినిమా ‘రెట్రో’. భారీ తారాగణం, విలక్షణ దర్శకుడిగా ముద్ర వేసుకున్న కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌కు తోడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పొందింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సితార పంపిణీ చేస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ప్రచారం చేశారు పంపిణీదారులు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందా? సమీక్షిద్దాం... 

కథ గురించి..: 

తిలక్ (జోజుజార్జ్) ఓ లోకల్ రౌడీ. స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ కూడా. ఆయన దగ్గర పనిచేసే సెక్యూరిటీని గుర్తుతెలియని వ్యక్తులు చంపేయడంతో అతని మనవడు పారివేల్ కన్నన్ (సూర్య) అనాథగా మారతాడు. తిలక్ భార్య సంధ్య (శ్వాసిక)కు పిల్లలు లేకపోవడంతో ఆ అనాథను ఆమె పెంచుకుంటానంటుంది. అలా సంధ్య పారివేల్‌ను కొడుకుగా స్వీకరించినా తిలక్ అంగీకరించడు. సంధ్య చనిపోయిన తర్వాత తిలక్ పారివేల్‌ను వదిలించుకుందామనుకుంటాడు. కానీ ఓ సందర్భంలో పారివేల్ అతన్ని కాపాడటంతో తన కింద పనికొస్తాడని ఆశ్రయం ఇస్తాడు. దీంతో తండ్రి కోసం క్రిమినల్ వ్యవహారాల్లో భాగమవుతాడు పారివేల్. పారివేల్ చిన్నప్పుడు పరిచయమైన రుక్మిణి (పూజ హెగ్డే)ను.. కొన్నేళ్ల తర్వాత అనుకోకుండా కలుస్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. గొడవలన్నీ వదిలేసి వస్తేనే చేసుకుంటానని ఆమె చెప్పడంతో పారివేల్.. మాఫియా, స్మగ్లింగ్ యాక్టివిటీస్ వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తర్వాత సీన్ కట్ చేస్తే.. వీరి పెళ్లికి ముందు ఆఫ్రికాకు వెళ్లాల్సిన ఓ గోల్డ్ ఫిష్ మెటీరియల్ వెళ్లకపోవడం, అది పారివేల్ ఎక్కడో దాచిపెట్టడంతో చెప్పకపోతే రుక్మిణిని చంపేస్తానంటాడు తిలక్. ఈ గొడవలో పెళ్లి రోజు పారివేల్ తిలక్ చేయి నరికి, కొంతమందిని చంపడంతో జైలుకు వెళ్తాడు. మరోవైపు రుక్మిణి.. మారానని చెప్పిన పారివేల్ పెళ్లి పందిట్లోనే రక్తపాతం పారించడంతో అసహ్యించుకొని పారివేల్‌కు దూరంగా వెళ్లిపోతుంది. పారివేల్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు. రుక్మిణి పారివేల్ ప్రేమ ఏమైంది? అనాథగా మిగిలిన పారివేల్ ఎవరు? ఆ గోల్డ్ ఫిష్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..? 

ఇటీవల సూర్య సినిమాలు అంతగా మెప్పించని నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో సినిమా అని, రెట్రో స్టుల్‌లో 90ల్లో సినిమా అనడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు వచ్చిన చాలా రెగ్యులర్ సినిమాల్లాంటి కథే ‘రెట్రో’ది. మార్పు ఏంటంటే ఈ కథను 90ల నేపథ్యంలో చూపించారు. ఇలా నైంటీస్ స్టోరీగా చూపించడం వల్ల కాబోలు ‘రెట్రో’ అని టైటిల్ పెట్టారు. కానీ టైటిల్‌కు, కథకు సంబంధమే లేదని చెప్పొచ్చు. అసలు సూర్య.. ఇలాంటి స్క్రిప్ట్ ఎలా ఒప్పుకున్నాడనే సందేహమూ కలగక మానదంటే నమ్మండి! ఎందుకంటే, టాలీవుడ్‌లో హిట్ టాక్ అందుకున్న ‘జయం మనదేరా’, ‘బాహుబలి’ లాంటి రొటీన్ క్లుమైక్స్. లవ్‌స్టోరీ కూడా రొటీన్. మొదట్నుంచి చివరిదాకా సాగదీతగా అనిపించేలా బోర్ కొట్టించారు. సినిమా అయిపోయిందనుకునేలోపు ఇంకా అవ్వలేదా అన్నట్టు నిరాశకు గురిచేశారు. ఇంకా చెప్పాలంటే.. స్టోరీలో మూడు నాలుగు లేయర్లుగా మంచి పాయింట్స్ కనిపించినా, వాటన్నింటినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కలగాబులగం చేయడం ద్వారా ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేశాడు. రకరకాల అంశాలు సరిగా లేకపోవడంతో కథ ఎటుపోతుంది? పాత్రలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాయి? వారి మధ్య పోరాటానికి టార్గెట్ ఏమిటనే క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకుడికి ఏం చూస్తున్నామో అర్ధం కాని పరిస్థితి. క్ల్లుమాక్స్‌లో కథ సారాంశాన్ని చెప్పిన తీరు ఒక్కటే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

ఎవరి పనితీరు ఎలా ఉందంటే..: 

కథ, కథనాలతో ప్రేక్షకుడిని మెప్పించడంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సక్సెస్ కాకపోయినప్పటికీ.. సూర్య తన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. పారివేల్ పాత్రలో ఉండే డిఫరెంట్ వేరియేన్స్ ఆకట్టుకుంటాయి. పూజ హెగ్డే నటించడానికి స్కోప్ లేని డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆమె రోల్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నా, సినిమాలో ఇంపాక్ట్ ఉండదు. జోజుజార్జ్, విధు నెగిటివ్ పాత్రల్లో మెప్పించారు. నాజర్, ప్రకాశ్‌రాజ్ అక్కడక్కడా గెస్ట్ పాత్రల్లో కనిపించారు. సుజిత్‌శంకర్ కామెడీ విలన్‌గా అక్కడక్కడా నవ్వించాడు. జయరాం కూడా నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. లొకేషన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.  అయితే, కథలో పస లేనప్పుడు సాంకేతిక విభాగాల పనితీరు కూడా డీలా పడుతుందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది ‘రెట్రో’. ప్రధానంగా కథలో వేగం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎలివేట్ కాకుండాపోయాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్తే కొంత నిరాశ తప్పదు. సూర్య పెర్ఫార్మెన్స్‌ను చూడటానికైతే వెళ్లొచ్చు.