01-08-2025 09:40:36 PM
ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మరీ నిర్మాణాలు..
రెవెన్యూ అధికారుల సహకారమేనని ఆరోపణలు..
రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికుల విమర్శలు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో నగరంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడాలని హైడ్రాను ఏర్పాటు చేసింది. అయినా సరే కొందరు మాత్రం దున్నపోతు పైన వర్షం పడినట్టుగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ రాత్రికిరాత్రే గదులు నిర్మిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. బాచుపల్లి మండల(Bachupally Mandal) పరిధిలోని బాచుపల్లి గ్రామం సాయి నగర్ లో సర్వే నెంబర్ 186 కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే గదులు నిర్మిస్తూ రెవెన్యూ అధికారులకు సవాల్ విసురుతున్నారు.
రెవెన్యూ అధికారులతో కుమ్మకై ప్రభుత్వ భూములు ఉండే ప్రాంతాల్లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తూ గదులు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. తలా పిడికెడు తిలాపాపం అన్నచందంగా రెవెన్యూ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలుమార్లు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా కూడా చర్యలు తీసుకోకపోవడంతో అధికారులకు, కబ్జాదారులకు భేరం కుదిరిందేమోనని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న గదులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
డాక్యుమెంట్స్ ఉన్నాయి..: ఆర్ఐ భాను చందర్
ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న గదులపై ఆర్ఐ భాను చందర్ ని వివరణ కోరగా... వాటికి డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయంటూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నాడు. ప్రభుత్వ భూములను పరిరక్షించే రెవెన్యూ అధికారి అయ్యి ఉండి ఫేక్ డాక్యుమెంట్లతో నిర్మిస్తున్న గదికి ఆర్ఐ సహకరించడం ఎంతో బాధాకరం.
చర్యలు తీసుకుంటాం..: ఎంఆర్ఓ పూల్ సింగ్
బాచుపల్లి ఎంఆర్ఓ ను వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న గదులపై సర్వే చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.