01-08-2025 09:38:30 PM
బీసీ రిజర్వేషన్ కై కవితక్క తలపెట్టిన 72 గంటల నిరవధిక దీక్షను విజయవంతం చేయాలి..
యుపిఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్ రామకోటి ప్రజాపతి
సూర్యాపేట (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో 42% రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని యునైటెడ్ పూలే ఫ్రెంట్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి రామ్ కోటి ప్రజాపతి, రాచమల్ల బాలకృష్ణ లు డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు సాధనకై తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈనెల 4, 5, 6, 7 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష వాల్ పోస్టర్లను శుక్రవారం స్థానిక జే ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించి మాట్లాడారు. కాబోయే ముఖ్యమంత్రులమని చెప్పుకునే నల్లగొండ కాంగ్రెస్ రెడ్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డిలు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.
బీసీలంతా నల్లగొండ జిల్లాలో రెడ్డిలను గెలిపించుకున్నారని వారు ఇప్పటికైనా బీసీల రిజర్వేషన్ కోసం ప్రశ్నించాలని లేని పక్షంలో బీసీల చేతుల్లో భూస్థాపితం తప్పదని హెచ్చరించారు. అడుగున ఉన్న బీసీ బిల్లును పార్లమెంటులో, అసెంబ్లీలకు పంపి 9వ షెడ్యూల్లో చేర్చిన ఘనత కల్వకుంట్ల కవితదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలతో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపాలని చూస్తుందన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన గవర్నర్ ఆమోదించకుండా న్యాయ సలహా కోసం పంపించడం ఏమిటని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్ బిల్లు సాధనకై నిర్వహించే 72 గంటల నిరవధిక నిరాహారదీక్షకు 30 కుల సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పగిళ్ల సైదులు, రెడ్డబోయిన నరేష్, కె వీరబాబు, సట్టు మురళి, వేముల వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.