calender_icon.png 2 December, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల నాయకత్వంలో బహుజనుల రాజ్యాధికారం..

02-12-2025 08:51:00 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): అణగారిన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం అని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలంలోని మాదారం 3 ఇంక్లైన్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి మేడి శివ నామినేషన్ వేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహేష్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 90 శాతం ఉన్నప్పటికీ, పిరికెడు మంది కూడా లేని అగ్రవర్ణాల పెత్తనానికి, అణిచివేతకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం అగ్రవర్ణాల పార్టీలు డబ్బు రాజకీయాలను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. నిజమైన ప్రజా రాజకీయాలను ప్రజలకు అందేవిధంగా ఎవరెంతో వారికంత వాటా అన్ని రంగాల్లో చట్టబద్ధంగా దక్కాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు ఊడిగం చేస్తూ, వారికి కొమ్ముకాస్తున్న బహుజనులు మేల్కొని, మన రాజ్యాధికారం సాధించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాల  ఆగడాలకు చరమగీతం పాడాలని, వారి పార్టీలకు రాజకీయ సమాధులు కట్టేందుకు పునాది వేయాలని, ఈ స్థానిక ఎన్నికల్లో  మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని కోరారు. అగ్రవర్ణాల నాయకుల కనుసన్నల్లో పోటీలో ఉండి, మళ్ళీ అగ్రవర్ణాల నాయకులకు ఊడిగం చేసేవారిని ఓడగొట్టాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేసే వారిని గెలిపించాలని తెలిపారు. రానున్నది బీసీ రాజ్యమే అని, బీసీల నాయకత్వంలో బహుజనుల రాజ్యాధికారం సాధించేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అగ్ర వర్గాల అభ్యర్థులను ఒడగొట్టేందుకే జనరల్ స్థానంలో వారిని ఎదురించగల సత్తా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేడి శివ ను బరిలో దించామని తెలిపారు. డబ్బు రాజకీయాలకు చరమగీతం పాడాలని, అగ్రవర్ణాల రాజకీయ ఎత్తుగడలను అణిచివేసి, ప్రజా రాజకీయాలకు జీవం పోయాలని  కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు దాస్యపు దీపక్, సహాయక కార్యదర్శి పడాల శివతేజ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తాండూర్ మండలం ఇంచార్జి వాసాల అనిల్, బుద్ధార్థి స్వామి తదితరులు పాల్గొన్నారు.