20-08-2025 12:58:03 AM
మరో ఐదుగురు ముద్దాయిలకు కూడా..
ముగ్గురికి ఐదు సెక్షన్లలో శిక్షలు
మరో ముగ్గురికి మూడు సెక్షన్లలో శిక్షలు
నిజామాబాద్ ఆగస్టు 19:(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం రామన్న పేట్ గ్రామంలో ఒక దళిత వ్యక్తి ఇంటి ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించి, ఇంటిని జేసిబి తో కూల్చివేసి, కులం పేరుతో దూశించిన నేరారోపణలు రుజువు అయినట్లు నిర్దారిస్తూ ప్రధాన ముద్దాయి బాజిరెడ్డి రమకాంత్, అరిగేల జనార్ధన్, కోమన్పల్లి మల్లేష్, లకు ఐదు క్రిమినల్ నేరాలలో, పాలెం గంగాధర్, కాకి విజయ, కుంటాం రాధ లకు జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ సోమవారం తీర్పుచెప్పారు.
మోర్తాడ్ మండలం రామన్న పేట్ గ్రామానికి చెందిన దళితుడైన పత్రి పోషయ్యకు వారసత్వంగా వచ్చిన ఇల్లు ఉన్నది.ఇల్లు తనది అంటు అతని బంధువు కాకి విజయ గొడవ పెట్టుకునేది. ఈ విషయంలో సహాయం చేసి, సహకరించాలని ఆమె బాజిరెడ్డి రమకాంత్ ను కోరింది. అతను తన కులస్థులు అయిన జనార్ధన్, మల్లేష్ లతో పాటు పోషయ్య బంధువు విజయను, ఆమె బంధువులు పాలెం గంగాధర్, రాధ లను వెంటబెట్టుకుని పోషయ్య ఇంటి ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించి జేసిబి సహాయంతో కూల్చివేశారు.
చంపివేస్తామని బెదిరింపులు చేశారు. రమాకాంత్, జనార్ధన్, మల్లేష్ లు కులం పేరుతో దూశించారనే నేర ఆరోపణలు కోర్టు విచారణలో రుజువు అయినట్లు నిరూపన కావడంతో జైలుశిక్షలు విధించారు. రమాకాంత్, జనార్ధన్, మల్లేష్ లపై ఐదు నేరాలు రుజువు కావడంతో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు, ఎస్ సి, ఎస్ టి చట్టం ప్రకారం రెండు సెక్షన్ లకు నాలుగు సంవత్సరాల చెప్పున కారగార శిక్షలు విధించారు. గంగాధర్, విజయ, రాధ లకు మూడు ఐపిసి సెక్షన్ లకు గాను సంవత్సరం, రెండు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలు చొప్పున జైలుశిక్షలు విధించారు. శిక్షలన్నీ ఏక కాలంలో అనుభవించాలని జడ్జి శ్రీనివాస్ తీర్పులో పేర్కొన్నారు