20-08-2025 01:40:15 AM
ప్రజాస్వామ్య విలువలు గల న్యాయకోవిదుడిని ఎంపిక చేశాం: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారనే ఊహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. విపక్షాల అభ్యర్థిగా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దిం పాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మంగళవారం ఈ మేరకు న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
‘కూటమి’లోని పార్టీలన్నీ కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించాయని, తాము న్యాయకోవిదుడైన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని తమ అభ్యర్థిగా ఎంపిక చేశామని స్పష్టం చేశారు. విపక్ష పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకే అభ్యర్థిని ప్రకటించడం ఆనందాన్నిచ్చిందని వెల్లడించారు. దేశంలో అతి కొద్దిమంది న్యాయకోవిదుల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఒకరని కొనియాడారు.
న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్, అస్సాం హైకోర్టుల పరిధిలో విశిష్ట సేవలందించారని గుర్తుచేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి రాజ్యాం గ వ్యవస్థలపైనా సంపూర్ణమైన అవగాహన ఉందని వివరించారు. ప్రజాస్వామ్య విలువలను పాటించే న్యాయమూర్తి అని, సామజిక న్యాయం కోసం పరితపించే న్యాయకోవిదుడని పేర్కొన్నారు.
విశిష్ట సేవలు..
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు న్యాయమూ ర్తిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన మైలురాయిగా నిలిచే తీర్పులు ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు అనధికారికంగా నియమించిన‘సల్వాజుడుం’ మిలీషియా రాజ్యాం గానికి విరుద్ధమని ప్రకటించారు.
విదేశాల్లో దాచిన నల్లధనం దర్యాప్తు కేసుల్లో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహించడాన్ని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తప్పుబట్టారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని తీర్పు వెలువరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి న తర్వాత తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టేందుకు ఏర్పాటు చేసిన 11 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి స్వతంత్ర కమిటీకి అధ్యక్షత వహించారు.
ఎన్నిక ఏకగ్రీవం కోసం అధికార పార్టీ యత్నాలు..
ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఇప్పటికే రాధాకృష్ణన్ పేరు ఖరారు కావడంతో, ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా ఎవరు నిలుస్తారనే చర్చ రాజకీయ పార్టీల్లో మొదలైంది. ఆ చర్చకు తెరదించుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధా కృష్ణన్‌నే ఏకగ్రీవంగా ఉప రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని అధికార పక్షమైన బీజేపీ విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది.
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని అధికార పార్టీ బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనిలో భాగం గానే ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జున ఖర్గేకు కాల్ చేసి మద్దతు కోరినట్లు తెలిసింది. అంతకముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎన్డీయే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్ష పార్టీలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
నా ఎంపిక ఆనందాన్నిచ్చింది: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
ఇండియా కూటమి తనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘దేశ జనాభాలో 60శాతా నికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలన్నీ కలిసి నన్ను ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయడం ఆనందాన్నిచ్చింది. ఎన్నికల ఫలితాలను ఎవరూ ఊహించలేరు. అంచనా వేయలేరు.
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నేను బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నా. నా అభ్యర్థిత్వాన్ని పరిగణించాలని పార్లమెంట్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో ఉన్న సీపీ రాధాకృష్ణన్, నేను యాదృచ్ఛికంగా దక్షిణాది చెందిన వాళ్లం. ఈ పోటీని ఒకే ప్రాంతానికి చెంది ఇద్దరి మధ్య పోటీగా భావించడం లేదు. దక్షిణాది కంటే ముందు మేమిద్దరం భారతీయులం’ అని స్పష్టం చేశారు.