11-12-2025 12:47:13 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలాది మంది వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులకు జీహెచ్‌ఎంసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్‌ల రెన్యూ వల్ ప్రక్రియపై బుధవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత గడువులోపు లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకోకపోతే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
ఫెనాల్టీ లేకుండా రెన్యూవల్ చేసుకునేందుకు ఈ నెల 20ను ఆఖరు తేదీగా నిర్ణయించింది. వ్యాపారులు ఎలాం టి అదనపు రుసుము చెల్లించకుండా తమ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకునేందుకు ఇక కేవలం 10 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. గడువు దాటిన తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తే, ఆలస్య రుసుము కింద భారీ పెనాల్టీలు విధిస్తారు. డిసెంబర్ 20లోపు సున్నా ఫెనాల్టీ. కేవలం నిర్ణీత లైసెన్స్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
డిసెంబర్ 21 నుంచి ఫిబ్రవరి 19, 2026 మధ్య కాలంలో రెన్యూవల్ చేసుకుంటే 25 శాతం ఫెనాల్టీ. అసలు లైసెన్స్ ఫీజుపై అదనంగా 25 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుం ది. ఫిబ్రవరి 20, 2026 తర్వాత రెన్యూవల్ చేసుకుంటే అసలు ఫీజుపై ఏకంగా 50 శాతం అదనంగా చెల్లించుకోవాల్సిందే. సాధారణంగా చాలామంది వ్యాపారులు గడువు ముగిసే చివరి రోజు వరకు వేచి చూస్తుంటారు. దీనివల్ల సర్వర్లపై ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అంతేకాకుండా జీహెఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతా యి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. చివరి నిమిషం రద్దీని, భారీ పెనాల్టీలను తప్పించుకోవాలంటే వ్యాపారులు ముందుగానే రీన్యువల్ పూర్తి చేసుకోవాలి అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అర్ వి కర్ణన్ విజ్ఞప్తి చేశారు.
ఆన్‌లైన్‌లోనే సులువుగా..వ్యాపారులు తమ లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకునేందుకు జీహెఎంసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఆన్‌లైన్ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. చిన్న కిరాణా షాపుల నుంచి పెద్ద మాల్స్, హోటల్స్, ఆసుపత్రుల వరకు అన్ని రకాల వ్యాపార సంస్థలు ఈ గడువును పాటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.