12-12-2025 01:24:29 AM
ఓయూలాగే మిగతా వర్సిటీలకూ నిధులివ్వండి!
ప్రభుత్వాన్ని కోరనున్న పలు వర్సిటీల వీసీలు
మిగతా వర్సిటీలనూ పట్టించుకోవాలంటున్న విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఏకంగా రూ. వెయ్యి కోట్ల నిధు లను ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆగస్టు నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ వేదికగా ప్రకటించినట్లుగానే.. ఆ వర్సిటీ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లను కేటాయించారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఆ మాత్రం నిధులు కేటాయించా ల్సిందే.. కేటాయించాలి కూడా. కానీ రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.
ఉస్మానియా వర్సిటీకు ఇచ్చినంత కాకున్నా అందులో ఎంతో కొంత మిగతా యూనివర్సిటీల కు కూడా ప్రభుత్వం నిధులను మంజూరుచేయాలని పలు యూనివర్సిటీల వీసీ లు కోరుతున్నారు. బహిరంగంగా తమ కోరికను వ్యక్తం చేయకున్నప్పటికినీ, తమ యూనివర్సిటీలకు కూడా నిధులు ఇస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఉస్మానియా వర్సిటీకు మాట ఇచ్చినట్లుగా సీఎం మాకూ మాటివ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఎప్పుడూ అరకొర నిధులే..
ఒక యూనివర్సిటీకి ఎప్పుడు ఇంత పెద్దమొత్తంలో నిధులను కేటాయించిన దాఖలాలు లేవు. ఒకవేళ కేటాయించినా రూ. 100.. రూ. 200 కోట్లే మహా ఎక్కువ. ఇక మిగతా యూనివర్సిటీలకైతే వర్సిటీ డెవలప్‌మెంట్ బడ్జెట్ కింద రూ. 25 కోట్లు.. రూ. 35 కోట్లు, రూ. 50 కోట్లే ఎక్కువ. అవి కూడా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఉంటాయి. అవి ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. ఇలాంటి క్రమంలో యూనివర్సిటీలకు సముచితంగా నిధులు కేటాయించకుంటే ఉంటే ఆ విశ్వవిద్యాలయాలను నిర్వహించడం ఎలా అవుతాయని విద్యా నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని విద్యార్థులను మన వర్సిటీలు ఎలా ఆకర్షిస్తాయి.. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఎలా పోటీ పడతాయని వారు అంటున్నారు. అన్ని వసతులు, మౌలికసదుపాయాలు, మంచి తరగతి గదులు, సరిపడా ఫ్యాకల్టీ, ల్యాబ్, హాస్టళ్లు, భవనాలు, పరిశోధన కేంద్రాలు, ప్లే గ్రౌండ్ ఇవన్నీ వర్సిటీల్లో ఉండాల్సిందే. ఇవి ఉండాలంటే గతంలో కాకుండా భారీస్థాయిలో ఆయా వర్సిటీలకు నిధులను కేటాయించాలి. కానీ కొన్నేళ్లుగా వర్సిటీలకు కేటాయించే నిధులు అందులో పనిచేసే వారికి జీతాలు, చిన్నా చితకా పనులకే సరిపోతున్నాయి. ఇక వాటితో ప్రపంచస్థాయి అభివృద్ధి ఎలా సాధ్యమని వర్సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
100 కోట్ల నుంచి రూ. 500 కోట్లు..
ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో పది యూనివర్సిటీలకు రూ. 500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీ , చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలకు రూ. 100 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకు రూ. 50 కోట్లు, మహాత్మాగాంధీ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, శాతవాహన వర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీ, తెలంగాణ వర్సిటీలకు రూ. 35 కోట్ల చొప్పున కేటాయించారు. ఇక అంబేద్కర్ వర్సిటీకు రూ. 25 కోట్లను కేటాయించింది.
2025 26 ఆర్థి సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన ఈ నిధులు శాతవాహనతోపాటు ఇంకొన్ని వర్సిటీలకు ఇటీవలే నిధులు విడుదలయ్యా యి. ఈ నిధులు కాకుండా మిగతా ఒక్కో వర్సిటీకి కనీసం రూ. 100 కోట్లు నుంచి రూ. 500 కోట్ల వరకు కేటాయించాలని ప్ర భుత్వాన్ని అడగాలని పలు వర్సిటీ వీసీలు అ నుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచే యోచనలో పలువురు వీసీలు ఉన్నట్లుగా తెలిసింది.
వర్సిటీల్లో సమస్యలు అనేకం..
రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిస్థితి దారుణంగా ఉంది. ఏదైనా చిన్నా చితకా రిపేరు చేయడానికి సైతం నిధులు లేని పరిస్థితి ఉంది. ఉస్మానియా, కాకతీయ పెద్ద యూనివర్సిటీలను పక్కనబెడితే రాష్ట్రంలోని మిగిలిన వర్సిటీలన్నీ సమస్యలతో కునారిల్లుతున్నాయి. అదనపు తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్‌లు లేవు. ఉన్నా ఎప్పటివో పాతకాలం నాటివి ఉన్నాయి. పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలో సరిపడా బిల్డింగ్‌లు లేవు.
సురవరం ప్రతాపరెడ్డిని నాంపల్లి నుంచి బాచుపల్లికి తరలించారు గానీ, అక్కడ పెద్దగా వసతుల్లేవు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు సరిపడా హాస్టల్ వసతిలేక బయట ఉంటున్నారు. మహిళా వర్సిటీగా ప్రకటించిన చాకలి ఐలమ్మ వర్సిటీకి కొత్త బిల్డింగే లేదు. కోఠి ఉమెన్స్ కాలేజీలోనే కొనసాగుతోంది. మెస్ బిల్లులు విడుదల కాకపోవడంతో నాణ్యమైన ఆహారాన్ని నిర్వాహకులు అందించలేకపోతున్నారు.
దీనిప్రభావం ఎక్కువగా విద్యార్థినులపైన పడుతోంది. అన్ని యూనివర్సిటీల్లో 70 నుంచి 80 శాతం అధ్యాపకులేలేరు. అధ్యాపకుల్లేకపోవడంతో వర్సిటీల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. నాణ్యమైన విద్య దొరకని పరిస్థితి ఉంది. విద్యార్థులకు ఫెలోషిప్, స్కాలర్‌షిప్ రావడంలేదని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల వర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇవి కాకుండా కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ ఉంది.
మిగతా వర్సిటీలను పట్టించుకోవాలి
మిగతా యూనివర్సిటీలవైపు కూడా సీఎం చూడాలి. అందులో చదువుకునేది ఇక్కడి విద్యార్థులే. ఉస్మానియాకు రూ.వెయ్యి కోట్లకు సంబంధించి పరిపాలన అనుమతులు కాదు. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ విడుదల చేయాలి. ఇలాంటి జీవోలు చాలా వస్తాయి. కానీ నిధులు విడుదల జరగదు. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. మిగతా ఒక్కో వర్సిటీకి కూడా రూ. 500 కోట్లు ఇవ్వాలి. ప్రొఫెసర్లు లేకుండా నాణ్యమైన విద్యా ఎలా సాధ్యం.?
జానారెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు