12-12-2025 01:42:41 AM
గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మంత్రులు, తెలంగాణ ప్రభుత్వ ఉన్నత అధికారులకు..
ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ చాలా మంచి ఫలితాలు అందించింది. ఈ వేదికగా రూ. 5.75 లక్షల కోట్ల విలువ చేసే ఎంఓయూలు కుదుర్చుకోవడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యంగా ప్రపంచం చూస్తోందనే విషయానికి ఇది స్పష్టమైన నిదర్శనం. ఈ సమ్మిట్ వల్ల హైదరాబాద్‌కు అద్భుతమైన బ్రాండింగ్ విలువ వచ్చింది.
ప్రపంచస్థాయిలో ఈ ఈవెంట్‌ను ఇంత పెద్దఎత్తున నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించాలి. అయితే, చాలా మంది పౌరులు, పారిశ్రామిక నిపుణులు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణలో భాగంగా కొంత ప్రజాధనం వృథా అయిందని, కోట్లాది రూపాయలు సరైన విధంగా వినియోగించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సదస్సుకు సంబంధించిన కొన్ని పనులను టెండర్లు లేకుండానే 200 నుంచి 300 శాతం ఎక్కువ రేట్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో కనీసం రూ. 100 కోట్లు వరకు అనవసర వ్యయం జరిగినట్టు అభిప్రాయాలు వెలువడుతున్నాయి. నిస్సందేహంగా గ్లోబల్ సమ్మిట్ విజయం సాధిం చింది. కానీ ఇలాంటి అంశాలు ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఇంతటి భారీ సదస్సు ను మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తే రూ. 100 కోట్లు వృథాగా ఖర్చు అయ్యేవి కాదు.
దీంతోపాటు లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ గతంలో జరిగిన ఒప్పందాలను పరిశీలిస్తే.. సంతకం చేసిన ఎంఓయూల్లో కేవలం 50 శాతం మాత్రమే గ్రౌండింగ్ అవుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో కనీసం భవిష్యత్‌లో ఇలాంటి సదస్సులను మరింత పెద్దగా, ఫలప్రదంగా, కేవలం లెక్కలకే పరిమితం కాకుండా నిజమైన పెట్టుబడులు వచ్చేలా నిర్వహించాలి.
ఆ దిశగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు..
1. తెలంగాణ రైజింగ్‌ను ప్రతి సంవత్స రం జరిగే ఫ్లాగ్ షిప్ ఈవెంట్‌గా చేయాలి. నిర్దిష్ట క్యాలెండర్ తేదీ ఉంటే ప్రపంచ పెట్టుబడిదారులు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. బ్రాండ్ తెలంగాణ విలువ మరింత పెరుగుతుంది.
2. ఫ్యూచర్ సిటీ వంటి ఒకే ప్రదేశంలో శాశ్వత, అత్యాధునిక హాళ్లు, కన్వెన్షన్ సదుపాయాలు, పెట్టుబడుదారులకు అనువైన ఎగ్జిబిషన్-కన్వెన్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి. ప్రతి సంవత్సరం తాత్కా లిక నిర్మాణాలు చేపట్టడం ద్వారా భారీగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే శాశ్వతంగా ఉండే విధంగా ఎగ్జిబిషన్ సదుపాయాలను ఏర్పాటు చేస్తే ఇతర ఈవెంట్లకు కూడా ఉపయోగించవచ్చు.
3. పాత ఎంఓయూలనే మళ్లీ ఒప్పం దం పేరిట తీసుకురావడం ఆపాలి. ఆ విధంగా చేసి ఎంఓయూల సంఖ్య పెంచ డం ద్వారా ప్రజల నమ్మకాన్ని దెబ్బ తీస్తుంది. కొత్త పెట్టుబడులను మాత్రమే చూపాలి. దీంతోపాటు గతంలో నిర్వహించిన సదస్సుల్లో ఒప్పందమైన ప్రాజెక్టుల గ్రౌండింగ్ గణాంకాలను, ప్రారంభోత్సవాలు ప్రధానంగా ప్రదర్శించాలి.
4. విదేశీ ప్రతినిధుల కంటే భారతీయ పరిశ్రమలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. స్థానిక పరిస్థితులను దేశీయ పారిశ్రామికవేత్తలు సులువుగా అర్థం చేసుకుని త్వరిత గతిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. తాజాగా వచ్చిన రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల్లో అధిక శాతం భారతీయ కంపెనీల నుంచే వచ్చింది. వీరితో లోతైన సంబంధాలు ఏర్పరచుకుంటే సత్వర ఫలితాలు వస్తాయి.
5. ‘ప్లగ్- అండ్ -ప్లే’ ఇండస్ట్రియల్ ప్యాకేజీలను ముందుగానే సిద్ధం చేయాలి.
* రంగాల వారీగా స్పెషల్ పర్పస్ వెహికిల్స్(ఎస్పీవీ)లు ఏర్పాటు చేయాలి
* అంతర్జాతీయ కన్సల్టెంట్లతో డీపీఆర్‌లు సిద్ధం చేయించాలి.
* భూమి, అనుమతులు, క్లియరెన్సులు ఎస్పీవీ పేరులో రెడీగా ఉంచాలి.
* సమిట్ రోజున ఎస్పీవీలను పెట్టుబడిదారునికి పారదర్శక ధరకు బదిలీ చేయాలి. ఎంఓయూ మాత్రమే కాదు.. బైండింగ్ అగ్రిమెంట్ ఇవ్వాలి. దీంతో మరుసటి రోజే పరిశ్రమల నిర్మాణం ప్రారంభం అవుతుంది.
6. రాజకీయ నాయకుల కోసం ఏర్పా టు చేసే రెడ్ కార్పెట్ వేడుకలకు బదులుగా, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మంత్రుల స్థాయిలోనే సంప్రదింపులు చేపట్టాలి. సదస్సుకు 6 నుంచి 8 నెలల ముందు నుంచి ముఖ్యమంత్రి, మంత్రు లు, సెక్రెటరీలు ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌లోని అగ్రశ్రేణి 100 పారిశ్రామికవేత్తల కార్యాలయాలకు వెళ్లి ప్రత్యక్షంగా మాట్లాడాలి. దావోస్ నుంచి లేదా మధ్యవర్తుల ద్వారా అందే ఆహ్వానాల కంటే, ప్రముఖుల బోర్డు రూముల్లో జరిపే ముఖాముఖి సంభాషణల ద్వారా ఎక్కువ ప్రభావం ఉంటుంది.
7. పెట్టుబడిదారులను సెక్రటేరియట్‌లో వేచిఉంచే పాత సంస్కృతికి స్వస్తి పలకాలి. హైదరాబాద్‌కు వచ్చిన పెట్టుబడిదారున్ని వెంటనే మీటింగ్ ఆ హ్వానించాలి. ఆతిథ్యం ఇవ్వాలి.
8. ఐ అండ్ పీఆర్ విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించి, ప్రొఫెషనల్ పీఆర్, ఇన్వెస్టర్ రిలే షన్స్ ఏజెన్సీ ఏర్పాటుచేయాలి. సదస్సు లు నిర్వహించిన సమయంలోనే కా కుండా సంవత్సరం మొత్తం తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు ప్రపంచా నికి చేర్చేలా చేయాలి. అవసరమైతే ప్ర త్యేక ఇన్వెస్ట్‌మెంట్ మంత్రిత్వ శాఖ ప్రారంభించాలి.
ప్రతిపక్ష నాయకులను కూడా సదస్సులకు ఆహ్వానించడం అత్యంత కీలకం. ప్రత్యే కంగా కేటీఆర్ వంటి నేతలు సదస్సుల్లో పా ల్గొనడం ద్వారా పెట్టుబడిదారులకు చాలా బలమైన మెసేజ్ వెళ్తుంది. దీంతో ప్రభుత్వ మార్పులు పెట్టుబడులపై ఎలాంటి ప్రభా వం చూపవని వారు నమ్మడానికి అవకా శం లభిస్తుంది.
పీపీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూఎన్ సమావేశంలో కాశ్మీర్ అంశంపై మాట్లాడానికి భారతదేశ ప్రతినిధిగా ప్రతిపక్ష నేత అ యిన వాజపేయిని పంపించారు. ఇందిరా గాంధీ-రాజీవ్ గాంధీ హయాంలోనూ ప్రధాన నిర్ణయాలకు ప్రతిపక్ష నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ర్ట అభివృద్ధి విషయం లో రాజకీయ విభేదాలు పక్కన పెట్టాలి. అప్పుడే తెలంగాణ బ్రాండ్ మరింత పెరుగుతుంది.
9. కఠినమైన మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
* ప్రతి ప్రాజెక్టుపై నెలనెలా సీఎం నేతృత్వంలో వీడియోకాన్ఫరెన్స్ రివ్యూ లు జరపాలి.
* పనుల పురోగతిని ప్రజలు, పెట్టుబడిదారులు పరిశీలించేందుకు రియల్-టైమ్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలి
* ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక రిలేషన్‌షిప్ మేనేజర్‌ను నియమించాలి.
10. ముఖ్యంగా ప్రతిస్థాయిలో అవినీతికి పూర్తిగా తావు లేకుండా చూడాలి. సమ్మిట్‌కు సంబంధించిన పనులు, టెండర్లు, భూముల కేటాయింపులు, క్లియరెన్సు లు ప్రతి దశలో సంపూర్ణ పారదర్శకత ఉండాలి. అప్పుడే తెలంగాణ రూ.5 లక్ష ల కోట్లు కాకుండా, ప్రతి సంవత్సరం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుంది.
కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన
అనేక సహజమైన పారిశ్రామిక అనుకూలతలు తెలంగా ణకు ఉన్నాయి. భౌగోళిక స్వరూపం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నీటి లభ్య త, నాణ్యమైన విద్యుత్, అత్యంత సురక్షిత వాతావరణం వంటివి ఎంతో కలిసివచ్చే అంశాలు. ఇవన్నీ ఉన్నప్పుడు కేవలం క్రమశిక్షణతో కూడిన అమలు, పారదర్శకత, బలమైన విధానాలు ద్వారా తెలంగాణ దేశంలోనే పెట్టుబడులకు నంబర్-1 రా ష్ర్టంగా ఎదగడం సులభం. మొదటి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ద్వారా ప్రభుత్వం ఏమి సాధించగలదో చూపించింది. ఇది భవిష్యత్‌లో ఇలాంటి సమ్మిట్ నిర్వహించడంలో ప్రభుత్వం ఎంత సీరియస్‌గా పని చేస్తుందో చూపిస్తుంది.
ధన్యవాదాలు.. శుభాకాంక్షలు..
సీఎల్ రాజం
చైర్మన్, విజయక్రాంతి
సీఎల్ రాజం
చైర్మన్, విజయక్రాంతి