calender_icon.png 12 December, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె పోరులో పై‘చేయి’!

12-12-2025 01:36:04 AM

పంచాయతీ మొదటి విడతలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం

  1. రెండోస్థానంలో బీఆర్‌ఎస్ 
  2. మూడోస్థానంలో స్వతంత్రులు 
  3. బీజేపీకి నాలుగో స్థానం 
  4.   84.28% ఓటింగ్ నమోదు
  5.   92.88 శాతంతో మొదటిస్థానంలో యాదాద్రి 
  6.   71.79 శాతంతో చివరి స్థానంలో భద్రాద్రి

మొదటి విడత ఫలితాలు

మద్దతు పార్టీ

కాంగ్రెస్       2,275

బీఆర్‌ఎస్ 1,148

బీజేపీ 186

ఇతరులు 518

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరిగిన మొదటి విడత పల్లె పోరులో హస్తం పార్టీ హవానే కొనసాగింది. నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే పైచెయ్యి సాధించింది. రాష్ట్రంలో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 27,628 వార్డులకు గాను 65,455 మంది బరిలో నిలిచారు. మొత్తంగా 84.28 శాతం ఓటింగ్ నమోదు కాగా.. 92.88 శాతంతో మొదటి స్థానం లో యాదాద్రి జిల్లా, 71.79 శాతంతో చివ రి స్థానంలో భద్రాద్రి జిల్లాలు నిలిచాయి.

అయితే అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచి మొదటిస్థానం లో నిలవగా.. రెండో స్థానంలో బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. మూడో స్థానంలో స్వతంత్రు లు గెలుపొందారు. ఇక బీజేపీ నాలుగో స్థానానికే పరిమితమైంది. అయితే చాలా గ్రామాల్లో అధికార కాంగ్రెస్ ఒకటి, రెండు ఓట్లతో పాటు 20లోపు మెజార్టీతో పదుల సంఖ్యలో గెలుపొందింది. సమానంగా వచ్చిన గ్రామాల్లో టాస్ వేసి ఫలితాలను ప్రకటించారు.

మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన మంచి తీర్పు అని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు పంచాయతీల్లో గట్టి పోటీ ఇస్తామనుకున్నప్పటికి సగం స్థానాలకే పరిమితమైంది. వందలాది గ్రామాల్లో అధికార కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినప్పటికి.. పదుల సంఖ్య ఓట్లతో ఓటమి చెందాల్సి వచ్చింది. 

కాంగ్రెస్ ముఖ్య నేతల గ్రామాల్లో ప్రతికూల ఫలితాలు

సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లుగా ఉన్న వారి సొంత గ్రామాల్లో తమ పార్టీకి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత తండాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్తావత్ సుజాత్ అనే మహిళా విజయం సాధించింది.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ స్వగ్రామం చిన్నబండిరేవులో, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ సొంత గ్రామం వీర్లపల్లి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సొంత గ్రామం జయన్న తిరుమలాపురంలో  బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలపొందారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి సొంత గ్రామం బాలెంలలో బీఆర్‌ఎస్ అభ్యరి భారీ మెజార్టీతో గెలుపొందారు. 

84.28 శాతం ఓట్లు నమోదు

పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 84.28 శాతం ఓట్లు నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం నమోదు కాగా, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం ఓట్లు పోలైనట్లు తెలిపారు. 90.53 శాతంతో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉండగా, 90.18 శాతం ఓటింగ్‌తో సూర్యూపేట జిల్లా మూడో స్థానంలో, 90.16తో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో ఓటింగ్ శాతం నమోదనైట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

జిల్లాలవారీగా పోలింగ్ శాతం

ఆదిలాబాద్ - 75.25, భద్రాద్రి కొత్తగూడెం - 71.79, హన్మకొండ - 83.95, జగిత్యాల - 77.68, జనగాం- 87.33, జయశంకర్ భూపాలపల్లి - 83.59, జోగులాంబ గద్వాల - 86.77, కామారెడ్డి - 79.40, కరీంనగర్ - 81.82, ఖమ్మం -90.16,  ఆసిఫాబాద్ - 78.78, మహబూబాబాద్ - 86.99, మహబూబ్‌నగర్ - 83.04, మంచిర్యాల్ - 80.04, మెదక్ - 88.46, ములుగు - 78.65, నాగర్‌కర్నూల్ - 87.41, నల్లగొండ - 90.53, నారాయణపేట్ -84.58, నిర్మల్ - 80.29 , నిజామాబాద్ - 81.37, పెద్దపల్లి - 82.24, రాజన్న సిరిసిల్ల - 79.57, రంగారెడ్డి - 88.67, సంగారెడ్డి- 87.96, సిద్దిపేట - 87.76, సూర్యాపేట - 90.18, వికారాబాద్ - 81.21, వనపర్తి- 84.94, వరంగల్ - 86.83, యాదాద్రి - భువనగిరి - 92.88 శాతం ఓటింగ్ నమోదంది. 


డ్రాలో తేలిన పలితం

సూర్యాపేట(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం కోటినాయక్ తండాలో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు సరిగ్గా 315 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు డ్రా తీయాల్సి వచ్చింది. ఈ డ్రాలో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చిట్టి పేరు రావడంతో అధికారులు ఆయననే విజేతగా ప్రకటించారు. 

మా విజయం ప్రజల విశ్వాసానికి నిదర్శనం

సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఘనవిజయం సాధించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలవడం కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రజల ఆశయా లకు అద్దం పట్టే ఈ ఫలితాలు, ప్రభుత్వంపై అపార నమ్మకాన్ని తిరిగి చాటాయన్నారు. 

 పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

గ్రామీణ ప్రజల ఆశీర్వాదానికి ధన్యవాదాలు

బీజేపీకి గ్రామీణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో పార్టీ బలోపేతం అవుతోందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి నరేంద్రమోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

 పంచాయతీ ఎన్నికల ఫలితాలపై రాంచందర్ రావు సంతోషం

ఇద్దరు అన్నలపై తమ్ముడి గెలుపు

ఆదిలాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం డలంలోని ఏమాయికుంట గ్రామంలో సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు బరిలో నిలిచారు. జాదవ్ లఖన్ (మాజీ సర్పంచ్), జాదవ్ కుబేర్, జాదవ్ అనార్ సింగ్ బరిలో ఉండ గా.. గురువారం జరిగిన ఎన్నికల్లో సుమారు 615 ఓట్ల మెజార్టీతో జాదవ్ లఖన్ మరోసారి సర్పంచ్‌గా గెలుపొందారు.

తమ్ముడిపై అన్న విజయం 

మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తోబుట్టిన అన్నదమ్ములు రా జకీయ ప్రత్యర్థులుగా మారి సర్పంచ్ ఎన్నికలు ఒకరిపై ఒకరు పోటీకి దిగగా గురువారం జరిగిన ఎన్నికల్లో తమ్ముడిపై అన్న ఘనవిజయం సాధించి సర్పంచ్ పదవి కైవసం చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ తరపున పులి వెంకన్న ఎన్నికల బరిలో నిలవగా, ఆయన తమ్ముడు పులి రామచంద్రు బీఆర్‌ఎస్ తరఫున పోటీకి దిగాడు. గురువారం నిర్వ హించిన ఎన్నికల్లో వెంకన్న.. రామచంద్రుపై 1000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించాడు.

కోడలిపై అత్త విజయం

ఆదిలాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో తొలివిడత సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇంద్రవెల్లి మండలం హీరా పూర్ పంచాయతీకి అత్త కోడలు పోటీ పడగా, ఏమాయికుంట సర్పంచ్ పదవి కో సం ముగ్గురు సొంత అన్నదమ్ములు బరిలో నిలిచారు. ఇచ్చోడ మండలం దాబా(బి) సర్పంచ్‌ను లక్కీ డ్రా ద్వారా  ఎన్నుకున్నారు. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడ్డారు. ఈ రసవత్తర పోరులో కోడలు తొడసం మహేశ్వరిపై అత్త తొడసం లక్ష్మీబాయి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు. 

ఒక్క ఓటుతో సర్పంచ్‌గా..

మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామర వంచ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన సనుప సుజాత ఒక్క ఓటు తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. నునావత్ స్వాతిపై ఆమె ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కౌంటింగ్ మొదలైన ప్పటి నుంచి ఒకటి రెండు ఓట్ల తేడా కనిపించడంతో మూడుసార్లు కౌంటింగ్ నిర్వహించి చివరకు ఒక్క ఓటు తేడాతో సుజాత గెలుపొందినట్లు ప్రకటించారు. దీంతో ఉత్కంఠ కు తెరపడింది.

కొడుకు సర్పంచ్.. తల్లి వార్డ్ మెంబర్

మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండలం మహమూద్ పట్నం గ్రామంలో గురు వారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా కొడుకు, వార్డు మెంబర్‌గా తల్లి ఎన్నికయ్యారు. గ్రామంలో ఎస్టి ఓటర్ల సంఖ్య కేవలం ఏడే ఉండగా సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డు సభ్యుల పదవులను ఎస్టీలకు రిజర్వేషన్ చేయడంతో ఆయా పదవులకు పోటీ చేయడానికి రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు ఎన్నికల్లో నిలబ డ్డారు.

సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన కట్ల ఎల్లయ్య విజయం సాధించగా, ఆయన తల్లి మూడవ వార్డుకు పోటీ చేసిన బుచ్చమ్మ ఎన్నికయ్యారు. రెండవ వార్డ్ కు పోటీ చేసిన భార్య లచ్చమ్మ పరాజయం పాలయ్యింది. మూడవ వార్డుకు పోటీ చేసిన బుచ్చమ్మకు 33 ఓట్లు, ప్రత్యర్థికి 33 ఓట్లు రాగా ఎన్నికల అధికారులు ‘టాస్’ ద్వారా ఎన్నిక నిర్వహించడంతో అదృష్టం కలిసి వచ్చి బుచ్చమ్మ వార్డు సభ్యురాలిగా ఎన్నికయింది.

రెండు ఓట్లతో విజయం

సూర్యాపేట(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన మోర సంధ్యాబిక్షం రెండు ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. ఈమెపై ము గ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీచేయగా ప్రారంభం నుంచి స్వల్ప మెజారిటీతో ముం దంజలో ఉన్నారు. చివరికి రెండు ఓట్లతో సంధ్యాబిక్షం గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం!

వికారాబాద్, డిసెంబర్ -11: గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది గంటల్లోనే వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండగల్ మండలం ఖాజాహైమద్‌పల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా లోపలి నుంచి అందిన సమాచారం ప్రకారం ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో లక్ష్మి తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రం వద్ద నుంచి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ఫలితాలతో గ్రామంలో రాజకీయం మరింత వేడెక్కింది. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.  

సర్పంచుగా గెలిచిన చనిపోయిన వ్యక్తి

సిరిసిల్ల జిల్లా చింతల్‌ఠాణాలో ఘటన 

వేములవాడ(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బ న్ మండలం చింతల్‌ఠాణాలో బీఆర్‌ఎస్ తరఫు న పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి (50) పోలింగ్‌కు రెండు రోజుల ముందు గుండెపోటుతో మరణించాడు. గురువారం జరిగిన ఎన్నికల్లో 700 కంటే ఎక్కువ ఓట్లు సాధించగా, సమీప అభ్యర్థిపై 378 ఓట్ల భారీ మెజారిటీ సాధించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. భౌతికంగా లేనందున సర్పంచు పదవిపై తదుపరి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని, తదుపరి చట్టపరమై న చర్యలపై చర్చిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.