11-12-2025 12:49:22 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన ప్రక్రియపై రాజకీయ వేడి రాజుకుంది. వార్డు ల సంఖ్యను 300కు పెంచుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో బుధవారం నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజే ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా బౌండరీల మార్పుపై ఎంఐఎం, బీజేపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.
జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీసుతో పాటు 57 సర్కిల్ ఆఫీసులు, 6 జోనల్ కార్యాలయాల్లో ఉద యం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు అన్ని చోట్ల కలిపి 100కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. మ్యాపులు కావా లి, వార్డుల విభజన ఎలా చేశారో అర్థం కావడం లేదని, పూర్తి వివరాలతో కూడిన మ్యాప్ ఇవ్వాలని చాలామంది కోరారు.
డీలిమిటేషన్ తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ వార్డులను మార్చకుండా అలాగే కొనసాగించాలని వినతులు వచ్చాయి. గోశామహల్ నియోజకవర్గంలో 4 ఎస్సీ డివిజన్లు కేటాయించాలని మాదిగ బంధుమిత్ర సంఘం కోరగా, మేయర్ సీటును ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నేత ఎల్లెష్ డిమాండ్ చేశారు.
కమిషనర్‌తో అక్బరుద్దీన్ భేటీ
వార్డుల పెంపు, బౌండరీల మార్పుపై ఎంఐఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ ఎమ్మెల్యేలు మజీద్, కౌసర్ మొహియుద్దీన్, ముజీబ్, కార్పొరేటర్లతో కలిసి జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిశారు. శాస్త్రీయత లేకుండా వార్డు లు పెంచారని, బౌండరీల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పునరాలోచించాలని కోరారు.
బీజేపీ కార్పొరేటర్ల ఆగ్రహం
మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా డీలిమిటేషన్ తీరుపై భగ్గుమంటున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లను కావాలనే మూడు, నాలుగు ముక్కలుగా విభజించి తమ బలాన్ని తగ్గించే కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. ఈ అస్తవ్యస్త విభజన పై ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గురువారం బీజేపీ సీనియర్ నేత, ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలవనున్నారు.