13-01-2026 12:58:25 AM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, జనవరి 12 (విజయక్రాంతి): మీరంతా స్మార్ట్ ఫోన్ కే పరిమితం కావొద్దు..స్మార్ట్ మనస్సును తయారు చేసుకోండి.. వైఫై కాదు& విల్ పవర్ పెంచుకోండి.. ప్రశ్నించే ధైర్యాన్ని నింపుకోండి .. అన్యాయం జరిగితే ఎదిరించే శక్తి పెంచుకోండి.. మీ కోసం, మీ కుటుంబం కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ లోని కళాభారతిలో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా పలువురికి ‘స్పోరట్స్ కిట్స్’ అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతిని ఖండాంతారాలు దాటించడమే కాకుండా భారతీయ సమాజాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. నిరాశలో ఉన్న యువతను తట్టి లేపేందుకు ఆయన చెప్పే మాటలు యువతకు తారక మంత్రంగా పనిచేస్తాయని అన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పమున్న యువతను 100 మందిని ఇవ్వండి.. ఈ దేశ తలరాతనే మార్చేస్తానంటూ స్వామి వివేకానంద చెప్పిన మాటలను చూస్తే... భారతీయ యువత శక్తి సామర్ధ్యాల మీద ఆయనకు ఎంత గట్టి నమ్మకం ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. కానీ ఈ రోజు యువత పరిస్థితి బాధాకరమని చేతిలో మొబైల్, ఇంటర్నేట్, ఆన్ లైన్ గేమ్స్, మద్యం, డ్రగ్స్ కు బానిసలవుతున్నారన్నారు.
విదేశాలన్నీ భారత్ ను ఫాలో అవుతుంటే... మనం మాత్రం మోడరన్ కల్చర్ పేరుతో విదేశీ కల్చర్ ను అలవాటు చేసుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చదువులోనే కాదు క్రీడల్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నించాలన్నారు. భవిష్యత్తుపై ఒక లక్ష్యాన్ని ఎంచుకోని పనిచేయాలని, దేశం కోసం నిలబడండి.. ధర్మం కోసం పనిచేయండి... అన్యాయాన్ని ఎదురించండి.. దేశాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.. అని పిలుపునిచ్చారు. డ్రగ్స్ పెడ్లర్స్ సమాచారం తెలిస్తే ప్రభుత్వానికి సమాచారమివ్వాలని, మీలోని బలహీనతలను విడిచి పెట్టాలన్నారు. భయాన్ని మనసులోకి రానీ యకండి.. భారతీయుడిగా గర్వంగా నిలబడండి.. అదే స్వామి వివేకానందుడికి మనం అందించే ఘనమైన నివాళి అని బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా యువజన అధికారి రాంబాబు, జిల్లా స్పోరట్స్ అధికారి శ్రీనివాస్ గౌడ్, పాల్గొన్నారు.