13-01-2026 12:56:17 AM
6 డీఏలు పెండింగ్‌లో ఉంటే
రాష్ర్టంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లే
బీఆర్‌ఎస్‌కు ఓటేసి దండుగ
కేంద్ర మంత్రి బండి సంజయ్
సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
రాజన్న సిరిసిల్ల, జనవరి 12 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలో సోమవారం బీజేపీ జెండాను ఎగురవేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద మాటకారి అని, విధిలేక రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించారే తప్ప వారిపట్ల ప్రేమ లేదని అన్నారు. 6 డీఏలు పెండింగ్‌లో పెట్టారని, ఈ లెక్కన రాష్ర్టంలో ఆర్థిక మాంద్యం ఉన్నదని కాంగ్రెస్ అంగీకరించాలన్నారు. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు పోతే ప్రభుత్వానికి కష్టమేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా 6 గ్యారంటీలు అమలు చేయలేదని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారకు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులిచ్చిందని, అమృత్ పథకం కింద రూ.104 కోట్ల నిధులిచ్చిందని, ఆ నిధులను ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సిరిసిల్ల మున్సిపాలిటీకి నయాపైసా ఇచ్చిందా? సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం నిధులిస్తే సక్రమంగా అభివృద్ధి చేయకపోవడం వల్ల వర్షం వస్తే సిరిసిల్ల పట్టణం మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ర్ట ప్రభుత్వం మెడలు వంచి నిధులు తీసుకొస్తానని చెప్పారు. బ్యాంకు అకౌంట్లు ఉన్న ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఉంది. నిజంగా ప్రభుత్వం ప్రమాద బీమా ప్రకటిస్తే బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం చెప్పాలి. బీఆర్‌ఎస్ పార్టీ కేంద్రంలో, రాష్ర్టంలో అధికారంలో లేదు. కేంద్రంలో ఒక్క ఎంపీ గెలవలేదు. ఆ పార్టీకి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేని అభిప్రాయపడ్డారు. బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఇంకో దిక్కు, అల్లుడు మరో దిక్కు అయ్యారని, అసలు ఆ పార్టీ ఉంటదో ఉండదో తెల్వక కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యాడని బండి సంజయ్ అన్నారు. ఈసారి హైదరాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మేయర్ సీట్లు కైవసం చేసుకోవడంతోపాటు సిరిసిల్ల, వేములవాడసహా అనేక మున్సిపాలిటీల్లో ఛైర్మన్ స్థానాలు సాధించబోయేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు.