calender_icon.png 6 December, 2024 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరు తరహాలో చెరువుల పునరుద్ధరణ

11-10-2024 12:23:27 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): నగరంలో చెరువుల పునరుద్ధరణపై హైడ్రా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది. నిన్న, మొన్నటి దాకా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లపై దృష్టి పెట్టి పలు కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. ఇప్పుడు పలు చెరువుల వద్ద కూల్చివేతల స్థానంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ చేపట్టిన పలు రాష్ట్రాల అధికారుల అనుభవాలను అధ్యయనం చేయడంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో కర్నాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ శ్రీనివాస్ రెడ్డితో బుధవారం సమావేశం కాగా, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బెంగళూరులో చెరువుల పునరుద్ధరణపై ఆనంద్ మల్లిగవాడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 35 చెరువులను పునరుద్ధరించిన విధానంతో పాటు నీళ్లు లేకుండా మురుగుతో ఉన్నవాటిని మంచినీటి చెరువులుగా ఎలా తీర్చిదిద్దారో రంగనాథ్‌కు వివరించారు.

ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. బెంగళూరులో జరిగిన చెరువుల పునరుద్ధరణపై క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలను అధ్యయం చేయను న్నట్టు వెల్లడించారు. ఆనంద్ మల్లిగవాడ్‌ను హైదరాబాద్‌కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్ధరణపై సహాయ, సహకారాలను అందజేయాలని కోరనున్నట్టు తెలిపారు.

ముందుగా సున్నం చెరువు, అప్పా చెరువు, ప్రగతినగర్ వద్ద ఉన్న ఎర్రకుంట, కూకట్‌పల్లి చెరువుల వద్ద కూల్చివేతల వ్యర్థాలను తొలగించి పునర్జీవనం చేయనున్నట్టు తెలిపారు. చెరువుల నిర్వహణ బాధ్యతలో స్థానికులకు భాగస్వామ్యం కల్పించేలా హైడ్రా కసరత్తు చేస్తుందని వెల్లడించారు.