calender_icon.png 20 December, 2025 | 4:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుమ్మలను ఆహ్వానించిన రామాలయ అధికారులు

20-12-2025 03:15:19 PM

భద్రాచలం,(విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి శ్రీ దామోదర్  శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను మర్యాదపూర్వకంగా కలిసి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు అధికారికంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి వంటి మహత్తర ఆధ్యాత్మిక పర్వదినాలు ప్రజలలో భక్తి, శ్రద్ధ, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఘనంగా నిర్వహించాలని దేవస్థాన అధికారులకు సూచనలు చేశారు.

ముఖ్యంగా ఆలయ ఆచారాలు, పూజా విధానాలు, ఉత్సవ కార్యక్రమాలు పురాతన సంప్రదాయాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, దర్శన సౌకర్యాలు, శాంతి భద్రతలు, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి  సూచించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించబడేలా అందరూ కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.