20-09-2025 10:52:19 AM
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ
మార్కెట్లోకి పూలు
నకిరేకల్, (విజయక్రాంతి): సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ నిలయమైతే అందుకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ(Bathukamma) పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ.. తెలంగాణ సాంస్కృతిక(Telangana culture) వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. ఇదొక పూల పండుగ. ఎక్కడా లేని విధంగా ప్రకృతిని పూజించే పండుగ. దసరా నవ రాత్రుల వేళ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే, తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబురం బతుకమ్మ పండుగ. ప్రతి ఏడాది ఆశ్వయుజ (మహాలయ)అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి.
కుల,మత,ప్రాంత విభేదాలు లేకుండా సబండ వర్గాల ప్రజలు ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ప్రకృతిలో లభించే తంగేడు, బంతి, గునుగు, నూకలి పువ్వు,చామంతి, గులాబీ, మందార, సీత జడ, పట్టుకుచ్చు, టేకు పువ్వు ,గడ్డిపువ్వు, బఠాని పువ్వు ప్రతి పువ్వుని ఏరికోరి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలు ఆడతారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ, అదే సమయంలో బతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు. ఈనెల 21న ఆదివారం ఎంగిలి పువ్వు బతుకమ్మ ప్రారంభం కావడంతో మార్కెట్లోకి పూలు వచ్చేశాయి. పల్లెల్లో దొరకాల్సిన పూలు పట్టణాల్లోకి విస్తరించాయి దీంతో ప్రజలు బతుకమ్మకు కావలసిన పూలు కొనుగోలు చేస్తున్నారు.
పూల ధరలు ఇలా..
ఎంగిలి పువ్వు బతుకమ్మ ఆదివారం కావడంతో పట్టణాల్లో సందడి నెలకొన్నది ఇప్పటికే పూలు బతుకమ్మ మార్కెట్లోకి వచ్చేసాయి.
-ఎర్ర బంతి, పచ్చబంతి 100- 150.కి.లో
-తెల్ల చామంచి, పచ్చ చామంచి,150-200కి.లో
పట్టుకుచ్చుపూలు.200-250 కి.లో
గూలాబి 200-250 కి.లో ఇవే కాదు మార్కెట్లో అన్ని రకాల పూలు అమ్మకాలకు ఉన్నాయి తంగేడు, గునుగు నూకలి పువ్వు కూడా మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. దీంతో ప్రజలు కావలసిన పూలను ఇట్టే కొనేస్తున్నారు. ఆడపడుచుల ఐక్యతతో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి.