23-01-2026 03:10:12 PM
రేవంత్ ది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముందు డైవర్షన్ కోసమే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) ఆరోపించారు. విచారణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకు నోటీసులు ఇస్తే వేధిస్తున్నారని ఢిల్లీ నుంచి గల్లీ దాకా గగ్గోలు పెట్టారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? బీఆర్ఎస్ నేతలను వేధించడం లేదా? అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది గోప్యంగా జరిగేదని, ప్రజల భద్రత కోసం సైలెంట్ గా ఒక వింగ్ పని చేస్తోందని సబిత వివరించారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ లేదా? కేసీఆర్ వచ్చాకే ట్యాపింగ్ జరిగాయా? అని ప్రశ్నించారు. మంత్రులు కూడా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని అంటున్నారు.. దానిపై సిట్ ఎందుకు వేయలేదన్నారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని తట్టుకోలేక పోతున్నారు... అందుకే సిట్‌ను శిఖండిలాగ వాడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌ను వేధించడానికి రేవంత్ రెడ్డి నక్కజిత్తుల రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కేసులు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తమను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తమ పార్టీ దృష్టి అంతా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పైనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని ఇంద్రారెడ్డి హెచ్చరించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి విచారణ నిమిత్తం కేటీఆర్ శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు.