23-01-2026 03:34:23 PM
ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై అధికారులతో సమీక్ష లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల 100శాతం గ్రౌండ్ చేయాలని మజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మార్క్ ఔట్ చేయని ఇందిరమ్మ ఇండ్ల పట్టణ ప్రాంతాలలో 1406, రూరల్ ప్రాంతాల్లో 967 పెండింగ్ ఉన్నాయని, మొత్తం జిల్లాలో 2373 ఇండ్లు పెండింగ్ లో ఉన్నాయని, జనవరి 30 నాటికి ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మార్క్ ఔట్ చేయని పక్షంలో వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి త్వరగా బేస్మెంట్ వరకు పనులు జరిగేలా పర్యవేక్షించాలని, నరేగా క్రింద 90 రోజుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఇందిరమ్మ ఇండ్ల పనులు నరేగా క్రింద నమోదు అయ్యేలా సంబంధిత ఎంపీడీవో, ఇతర మండల అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పెండింగ్ ఉన్న ఇందిరమ్మ ఇండ్ల ముగ్గులు పోసుకుంటే ఫిబ్రవరి నెలలో కనీసం 400 ఇండ్లు బేస్మెంట్ స్థాయికి చేరుతాయని, జనవరి 30 వరకు తప్పకుండా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు.
రాబోయే ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మండలంలో వివిధ స్టేజీ లలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు మార్చి నాటికీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి నిధులు లేని పక్షంలో మహిళా సంఘాల ద్వారా స్వయం సహాయక రుణాలు అందజేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో పీడీ హౌసింగ్ రాజేశ్వర్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.