04-08-2025 12:36:57 AM
మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ ఆగస్టు 3 (విజయ క్రాంతి) : బిసి రిజర్వేషన్ గురించి దేశ రాజధాని డిల్లీ లో చర్చించేలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణం లోని పాత పాలమూరు లోని మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాలు లో జరిగిన బిసి కులసంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంగా బడుగు బలహీన అనగారిన వర్గాల స్థితి గతులను ఆయన స్వయంగా గమనించారని, విద్యా , ఉద్యోగం , ఉపాధి అవకాశాలు పెరిగితేనే బిసిలు స్థితిగతులు పెరుగుతాయని భావించారని, బిసిలకు రిజర్వేషన్ ఉంటేనే వారి స్థితి గతులు మారుతాయని రాహుల్ గాంధీ ఆలోచన చేశారన్నారు .
బిసిలకు రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో లో పొందుపరిచిందన్నారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి తోటి బిసిలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం కుల గణన చేయించి, న్యాయనిపుణులతోటి సలహాలు తీసుకుని, అసెంబ్లీ లో చర్చించి తీర్మానం చేసి బిసి రిజర్వేషన్ చట్టం చేసి, దానిని కేంద్రానికి పం పించామని చెప్పారు . బిసిల పార్టీగా చెప్పుకునే బిజేపి పార్టీ , బిసిల రిజర్వేషన్ చట్టాన్ని ఏదో ఒక సాకు చూపి కావాలనే బిసిల రిజర్వేషన్ చట్టం అమలు చేయడం లేదని , కొర్రీలు వేస్తుంద ని ఆయన ఆరోపించారు.
మంద కృష్ణ మాదిగని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్ని విజయాలైనా సాధించవచ్చు అని ఆయన చెప్పారు. ప్రస్తుతం చట్టసభల్లో బిసి లు చాలా తక్కువగా ఉన్నారని , వారికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటుగా అంతిమంగా చట్ట సభల్లో సైతం రిజర్వేషన్ అమలు అయ్యేలా కాంగ్రెస్ పార్టీ బిసిలకు అండగా ఉం టుందని, కాంగ్రెస్ పార్టీకి బిసిలు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా ఉ న్న బిసి నాయకులను ఢిల్లీకి పిలిచి బిసి రిజర్వేషన్ అమలు కోసం రాహుల్ గాంధీ గారి మార్గంలో కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బిసిలకు 42% రిజర్వేషన్ అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపిలు ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని ఆయన తెలిపారు. బిసి రిజర్వేషన్ అమలు చేయకపోతే బిసిలే బిజేపి పార్టీని పాతాళంలోకి తొక్కుతాయని ఆయన హెచ్చరించారు.
బిసి రిజర్వేషన్ అమలు కోసం భవిష్యత్తు లో ఎటువంటి కార్యక్రమాలకైనా అండగా ఉంటామని స్పష్టం చేశారు. బిసిలు సంఘటితంగా ఉండాలని బిసి రిజర్వేషన్ అమలు కోసం అందరూ కలిసి రావాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో బిసి భవన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ,33 జిల్లాలో బిసి భవనాలు నిర్మించేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, గోపాల్ యాదవ్ నాయకులు మైత్రి యాదయ్య, గోనేల శ్రీనివాస్, వెంకట నర్సయ్య, శ్రీనివాస్ సాగర్, కృష్ణ ముదిరాజ్, పురుషోత్తం, గుండా మనోహర్, సంజీవరెడ్డి , ఎల్లంగారి భరత్ కుమార్ , బుగ్గన్న తదితరులు పాల్గొన్నారు.