30-12-2025 12:00:00 AM
మహదేవపూర్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ పరిధిలోని మహాదేవపూర్, కాటారం, మహాముత్తరం మండలా ల్లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన రెడ్డిగాండ్ల కులస్థులకు అక్రమంగా జారీ చేసిన బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు కాటారం డివిజన్ ప్రధాన సమస్యగా మారాయని బీసీ జేఏసీ, బీసీ కుల సంఘాల నాయకులు పే ర్కొన్నారు.అక్రమంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను పొందిన వారిని గుర్తించి తక్షణమే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి కోరారు.
2010లోనే అప్పటి బీసీ కమిషన్ చైర్మన్ దాల్వా సుబ్రమణ్యం రెడ్డి గాండ్లకు జారీ చేసిన బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని అధికారికంగా నిర్ణయించినప్పటికీ, ఆ ఆదేశాలను తుంగలో తొక్కుతూ రాజకీయ పలుకుబడి, అధికారుల నిర్లక్ష్యం కలిసి కాటారం డివిజన్లో 13 మంది అక్రమంగా బీ సీ సర్టిఫికెట్లు సంపాదించి, బీసీ రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేసి అధికార పదవులు ద క్కించుకున్నారని ఆరోపించారు. 2025 డిసెంబర్ 1, 11 తేదీల్లో బీసీ కమిషన్ స్టాం డింగ్ ఆర్డర్ ప్రకారం రెడ్డిగాండ్లకు జారీ చేసిన బీసీ సర్టిఫికెట్లను రద్దు చేయాలని జి ల్లా కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీసీలపై అధికార యంత్రాంగం చేస్తున్న బహిరంగ ద్రోహమని మండిపడ్డారు.
రెడ్డిగాండ్ల కులస్తులు అక్రమ బీసీ సర్టిఫికెట్లతో బీసీలకు దక్కాల్సిన రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులను బహిరంగంగా కొల్లగొడుతుండగా, కొన్ని కుటుంబాల్లో ఏకంగా ఎస్సీ సర్టిఫికెట్లు కూడా పొందారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు.తక్షణమే స్పందించి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ కమిషన్, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి రమేష్, బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా కన్వీనర్ కొ త్తూరు రవీందర్, అజాది ఫెడరేషన్ అమృత అశోక్, మహేందర్ వర్మ, కాటారం డివిజన్ బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు సముద్రాల తిరుపతి, నిడికొండ మైనర్ బాబు, నాగుల సంతోష్, మెంగాని అశోక్, బొల్లం కిషన్, వెన్నంపల్లి మహేష్, గోర శ్రీకాంత్, ఆత్మకూరు స్వామి యాదవ్, నగులూరి రాజబాబు, రెవిల్లి నాగరాజు, కోలా మహేష్, గొనె ముకుందం, రాకేష్, కంకణాల బాబు తదితరులు పాల్గొన్నారు.