కుమ్మెర ఘటనపై బీసీ కమిషన్ సీరియస్
బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ
హైదరాబాద్ సిటీ బ్యూరో. ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈనెల 18న జరిగిన రెండు నెలల పసిపాప మృతి ఘటనపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనలో బాధితులైన కుటుంబానికి తక్షణమే పోలీస్ భద్రత కల్పించాలని కోరుతూ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ డీజీపీ బి. శివధర్ రెడ్డికి శనివారం ఒక లేఖ రాశారు.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి అనేక బీసీ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కమిషన్ బాధితులకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. చనిపోయిన రెండు నెలల పాప తల్లి మౌనిక ప్రస్తుతం బాలింత అని, ఆమెకు తగిన విశ్రాంతితో పాటు అత్యవసర వైద్య పరీక్షలు, సదుపాయాలు కల్పించాలని చైర్మన్ నిరంజన్ తన లేఖలో డీజీపీని కోరారు. అలాగే, ఆ పాపను పూడ్చిన సమాధికి ఎటువంటి భంగం కలగకుండా, అసాంఘిక శక్తుల నుంచి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బాధితులు తీవ్ర భయాందోళనలో ఉన్నందున వారికి రక్షణ కల్పించడం ప్రభు త్వ బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.ఈ ఘటనపై వాస్తవాలను తెలుసుకునేందుకు ఈనెల 24వ తేదీన బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు కుమ్మెర గ్రామంలో పర్యటించారు. జాతర జరిగిన ప్రాంతానికి వెళ్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలో ఘటన వివరాలను సేకరించారు.
అనంతరం పాప సమాధి వద్దకు వెళ్లి కమిషన్ సభ్యులు శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. శిథిలావస్థలో ఉన్న బాధితుల ఇంటిని కూడా పరిశీలించి వారి దైన్య స్థితిని తెలుసుకున్నారు.కమిషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చనిపోయిన పాప తండ్రి గణేష్, తల్లి మౌనిక, నాయనమ్మ చంద్రకళలతో సుమారు 45 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు.
ఘటన జరిగిన తీరును, తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వారు కమిషన్ దృష్టికి తీసుకువ చ్చారు. అనేక ప్రజా సంఘాలు కూడా ఈ ఘటనపై కమిషన్ ను కలిసి న్యాయం చేయాలని కోరాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని, ఆ తదుపరి పరిణామాలను కమిషన్ నిశితంగా పరిశీలిస్తోందని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చైర్మన్ స్పష్టం చేశారు.




