calender_icon.png 29 October, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీనా.. ఓసీనా!

29-10-2025 12:00:00 AM

  1. సారథి వేట ఆసక్తికరం డీసీసీ  పీఠంపై ఉత్కంఠ 
  2. జెండా వీడనోళ్లకే ప్రాధాన్యం అభిప్రాయ సేకరణ పూర్తి 
  3. రేపోమాపో ప్రకటన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌పైనే భారం 

నిజామాబాద్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. టీపీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన సొంత జిల్లా కావడంతో, ఈ నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, తన రాజకీయ పట్టు పెంచుకునే దిశగా ఆయన అడుగులు ఉంటాయని తెలుస్తుంది.

దీంతో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షులుగా (ఓసీ కేటగిరీ) ఉన్న మానాల మోహన్ రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి (చైర్మన్) లభించడంతో, కొత్త అధ్యక్షుని నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో, పార్టీ అధిష్టానం ఇప్పటికే ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తుంది.

గతంలో ఎస్సీ, మైనార్టీ, ఓసీలకు పదవి కట్టబెట్టిన దృష్ట్యా,  ఈసారి బలమైన ఓటు బ్యాంకు కలిగిన బీసీలకు డీసీసీ పీఠం కట్టబెడితే ఎలా ఉంటుందని లెక్కలు వేస్తుంది. మూడు దశాబ్దాలుగా బీసీలకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కకపోవడం, ఇటు బీసీలకే పదవి ఇవ్వాలనే డిమాండ్ పార్టీ పెద్దలను ఆలోచనలో పడేస్తుంది.

బలంగా ’బీసీ’ వాదన..

ఈసారి డీసీసీ అధ్యక్ష పీఠాన్ని బీసీ (వెనుకబడిన తరగతుల) వర్గానికే కేటాయించాలన్న డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. గత ముప్పు ఏళ్లుగా జిల్లాలో పూర్తిస్థాయి బీసీ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ నియమించలేదన్న వాదన ఉంది. మధ్యలో ఆదన్న, దాసరి నర్సింలు వంటి నేతలకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినా, పూర్తి న్యాయం జరగలేదని బీసీ నేతలు భావిస్తున్నారు.

తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, బీసీ అధ్యక్షుడు ఉంటేనే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు.

బీసీ ఉద్యమ సమయంలో..

ప్రస్తుతం జిల్లాలో బీసీ ఉద్యమం ఉద్ధృతంగా ఉండటం, అన్ని పార్టీలు బీసీలకే పదవులు ఇవ్వాలని బీసీ జేఏసీ డిమాండ్ చేస్తుండటం కాంగ్రెస్పు ఒత్తిడి పెంచుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించిన తరుణంలో, పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేత ఉంటేనే క్షేత్రస్థాయిలో సానుకూల సంకేతాలు వెళ్తాయని, లేదంటే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

రాజకీయ సమీకరణాల్లో..

రాజకీయ సమీకరణాలు కూడా బీసీ నియామకం వైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ, ఇప్పటికే బీసీ కేటగిరీకి చెందిన దినేష్ను పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమించింది. మరోవైపు, బీఆర్‌ఎస్ పార్టీ ఓసీ కేటగిరీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డినే కొనసాగిస్తున్నా, త్వరలో అక్కడ కూడా మార్పులు ఉండవచ్చని, బీసీ అయిన తెలంగాణ ఉద్యమకారునికి పదవి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో, కాంగ్రెస్ కూడా సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఏర్పడింది.

అభిప్రాయ సేకరణ పూర్తి..

నూతన అధ్యక్షుని ఎంపిక కోసం టీపీసీసీ ఇప్పటికే విస్తృతంగా కసరత్తు చేసింది. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల (బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాన్సువాడ, బాల్కొండ) ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆశావహులు సైతం తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసి, కమిటీ సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ కమిటీ తన నివేదికను ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షునికి సమర్పించినట్లు సమాచారం.

‘లాయల్టీ’ కే పెద్ద పీట?.. 

అధ్యక్ష రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నా, ముఖ్యంగా బీసీ  కోటాలో బాడ్సీ చంద్రశేఖర్ గౌడ్, ఓసీ అయితే కాటిపల్లి నగేష్ రెడ్డి పేర్లు బలంగా ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరు పార్టీ కష్ట సమయంలోను జెండా, అజెండా వదలలేదు. సుమారు ముఫై ఏళ్ల పైబడి నుంచి కాంగ్రెస్ జెండా మోస్తున్నారు.  వీరితో పాటు మరికొందరు సీనియర్లు సైతం పదవిని ఆశిస్తున్నారు.

కొందరికి నిబంధనల అడ్డు..

అయితే, ఈసారి ఎంపికలో పార్టీ ఒక కఠిన నిబంధన విధించినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీని వీడి, తిరిగి చేరిన వారికి కీలక పదవులు ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిబంధన కొందరు ఆశావహులకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. వాళ్ళ ఆశలపై నీళ్లు పోస్తుంది. పార్టీ మారిన వాళ్ళకు పదవిస్తే, తప్పుడు సంకేతాలు పోతాయని భావిస్తోంది. కార్యకర్తలు ఎన్నికల్లో జంపింగ్ లకు అలవాటు పడే అవకాశాలు ఉంటాయని లెక్కలేస్తోంది.  కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారికే పదవి ఇచ్చి, విధేయతకు పట్టం కట్టాలని పార్టీ భావిస్తోంది. పార్టీ శ్రేణులు సైతం ఇదే కోరుకుంటున్నారు

బేరీజు వేసుకొని..

జిల్లాలో బలంగా ఉన్న బీసీల ఆకాంక్షలను నెరవేరుస్తూ, పార్టీకి విధేయుడిగా ఉన్న నేత కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. అన్ని సమీకరణాలను బేరీజు వేసి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, నిజామాబాద్ కాంగ్రెస్ కొత్త సారథి ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే కొన్ని రోజుల్లో సందిగ్ధత వీడనుంది.